ఉమ్మడి కడప జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. YS ప్రభంజనంలో చతికిలపడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా కోలుకోలేదు. నాడు వైఎస్ చేతిలో.. రెండు దఫాలుగా జగన్ చేతిలో ఓడి.. షెడ్డుకు చేరింది సైకిల్. అప్పట్లో అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెల్చుకోలేకపోయింది టీడీపీ. 2004లో ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ ఎక్కడికక్కడ సర్దుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కీలక పదవులు వెలగబెట్టిన వారంతా అధికారం దూరం కాగానే ఎవరిదారి వారు చూసుకున్నారు. టీడీపీ అంటే అభిమానం కలిగిన వారు మాత్రం ఈ మూడేళ్ల కాలంలో తమ శక్తిమేరా పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. ఆ మధ్య చంద్రబాబు జిల్లాలో పర్యటించడంతో వారిలో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవల మహానాడు తర్వాత పార్టీ కదలికలు జిల్లాలో పెరిగాయి. అయితే ఇదే సమయంలో సమస్యలు స్వాగతం చెబుతున్నట్టు పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి.
గతంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి కొంతకాలంగా టీడీపీలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారపార్టీపై విమర్శలు చేస్తూనే తమ ఉనికిని చాటుకుంటున్నారు కూడా. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఇటీవల నారా లోకేష్‌ను కలిసి పార్టీలో రీఎంట్రీకి అవకాశం ఇవ్వాలని కోరారు. చంద్రబాబుతో మాట్లాడి స్పష్టత ఇస్తామని లోకేష్ ఆయనకు బదులిచ్చారట. దీంతో కమలాపురం టీడీపీలో కలకలం మొదలైంది. కొద్దినెలల క్రితం మాజీ మంత్రి డీఎల్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. ఆయనకు పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదట. మైదుకూరు టీడీపీ ఇంఛార్జ్.. పుట్టా సుధాకర్ యాదవ్ అభిప్రాయం మేరకు డీఎల్‌ను చేర్చుకుంటామని చెప్పారట. అయితే వీరశివారెడ్డికి మాత్రం లైన్ క్లియరైనట్టు ప్రచారం ఊపందుకుంది.
తాజాగా కడప పార్లమెంట్‌స్థాయి టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాత నేతల చేరికలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సమన్వయకర్తగా వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎదుటే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు. అయితే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డిని తిరిగి టీడీపీలోకి రప్పించేందుకు అక్కడి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పులివెందుల టీడీపీ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉన్నారు. బీటెక్ రవికి నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలతో పడటం లేదట. వారే సతీష్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథిరెడ్డి, తొండూరు మండల నేతలు తదితరులు సతీష్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం రాంగ్ సిగ్నల్ పంపుతోందని అనుకున్నారో ఏమో.. బీటెక్ రవి సూచనల మేరకే సతీష్‌రెడ్డి దగ్గరకు వెళ్లామని చెబుతున్నారట. మొత్తానికి కీలక జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న టీడీపీ శ్రేణులు.. కొందరు నాయకులు వద్దు.. కొందరే ముద్దు అని సాగిస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.. ఎవరికి మోదం కలిగిస్తాయో చూడాలి.
