ఆ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఒక్కటయ్యారా? రహస్య సమావేశాలతో ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ల డిమాండ్స్‌కు ప్రధానపార్టీలు లొంగుతాయా? ఇంతకీ భేటీలో ఉన్నవాళ్లంతా ఏ నియోజకవర్గంపై గురిపెట్టారు? లెట్స్ వాచ్..!
పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం వాడీవేడీ చర్చకు కారణం అవుతున్న సమావేశం ఇదే. ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్లంతా వివిధ పార్టీలకు చెందిన బీసీ నాయకులు. అందరి అజెండా ఒక్కటే. పెద్దపల్లి టికెట్‌ను వచ్చే ఎన్నికల్లో బీసీలకు కేటాయించాలని. ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెడితే వారికే మద్దతు ఇవ్వాలని తీర్మానించేశారు. ఇందుకు నియోజకవర్గంలోని లెక్కలను కూడా బయటకు తీయడంతో అన్ని శిబిరాల్లోనూ అలజడి మొదలైంది. ఎన్నడూ లేనిది ఎందుకు రహస్య సమావేశాలు పెట్టుకున్నారు? వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ.. జెండాలు, కండువాలు పక్కన పడేసి ఎన్నికల్లో బీసీ అజెండాగా అడుగులు వేయగలరా అనేది ప్రశ్న.
పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, మంథని, రామగుండం. వీటిల్లో పెద్దపల్లి ఓటర్లలో 74 శాతం బీసీలే. ఎస్సీఎస్టీలు 20 శాతం వరకు ఉన్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఆరేడు శాతం ఓటర్లుగా ఉన్న ఓసీలకే టికెట్ ఇస్తున్నారని రహస్య సమావేశంలో ఫైర్ అయ్యారట నేతలు. పెద్దపల్లిలోని అప్పన్నపేట లైన్ భవనంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, జడ్పీ టీసీ గంటా రాములు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ ఎంపీపీ, బీజేపీ నాయకులు వచ్చారు. ఎవరికి వారు తమ పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కాకుండా.. ఏ పార్టీ బీసీలకు ఛాన్స్ ఇచ్చినా.. వాళ్లకు మద్దతివ్వాలని తీర్మానించడమే ఆసక్తి కలిగిస్తోంది. గతంలో పెద్దపల్లిలో మూడుదఫాలు బీసీ అభ్యర్థులకు వివిధ పార్టీలు ఛాన్స్ ఇచ్చాయి. ఇప్పుడు మాత్రం పోటీ చేసే అవకాశం బీసీలకు లభిస్తే.. గెలిపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట.
బీసీల ఐక్యత అనే నినాదాన్ని పెద్దపల్లిలో గ్రామ గ్రామానికీ తీసుకెళ్లాలని సమావేశంలో పాల్గొన్న నేతలు నిర్ణయించారట. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఒకే వాయిస్ వినిపిస్తే ఫలితం ఉంటుందని లెక్కలేస్తున్నారట. బీసీ నేతల రహస్య సమావేశం ఎలా ఉన్నా.. ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఇతర సామాజిక వర్గాల నేతలకు టెన్షన్ పట్టుకుందట. తమకు పార్టీ అవకాశం ఇస్తే.. బీసీ సామాజికవర్గం సహకరించకపోతే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మంథని, రామగుండం నియోజకవర్గాలలో కూడా బీసీలు గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. అక్కడ కూడా ఇదేవిధంగా ఒత్తిడి తెస్తే సమీకరణాలు మారిపోతాయని ప్రచారం జరుగుతోంది.
జెండాలు.. అజెండాలు పక్కన పెట్టాలన్న మాటలు సమావేశంలో పాల్గొన్న వారికి ఉత్సాహం తీసుకొచ్చినా.. ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఆ మాటపై నిలబడతారా అనే ప్రశ్నలు ఉన్నాయట. మరి.. రహస్య గళాలు.. సమావేశాలు ప్రధాన పార్టీలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో.. ఎవరికి టికెట్ ఇస్తాయో చూడాలి.