Site icon NTV Telugu

OTR: 100 రోజుల సవాల్.. MLA ప్రవీణ్ షాకింగ్ యాక్షన్..!!

Tdp Mla Bhashyam Praveen

Tdp Mla Bhashyam Praveen

OTR: భాష్యం ప్రవీణ్….. పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే. అసెంబ్లీకి ఫస్ట్‌ టైమర్‌ అయినా… అనేక వ్యవహారాల్లో బాగా ఆరితేరిపోయారన్న విమర్శలు, ఇసుక దందాల్లో బాగా చెయ్యి తిరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉంటాయి. అదే… ఎమ్మెల్యే ప్రవీణ్‌కు వరంగా మారిందని, పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటితో పాటు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో సార్‌ ఆరిపోయారని చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే అనుచరులు విపక్ష నాయకుల మీద దాడులు చేస్తున్నారది కూడా లోకల్‌ వాయిస్‌.

READ ALSO: OTR: కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ డ్రైవ్.. తెలంగాణ శాఖల్లో భారీ లీకులు బట్టబయలు..

మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గతంలో కృష్ణానది వరదలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే…. దారి మధ్యలోనే ఆయన అనుచరుల వాహనాలను అడ్డుకుని నానా రచ్చ చేయడం అప్పట్లో కలకలం రేపింది. మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్ సాంబిరెడ్డిపై దాడి చేసి కాళ్లు విరగ్గొట్టడం కూడా నియోజకవర్గంలో కలకలం రేపింది. ఈ దాడుల వెనుక ఎమ్మెల్యే ప్రవీణ్ ఉన్నారన్నది ప్రధాన అభియోగం. అలాగే… ఇటీవల పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత శాఖమూరు శ్రీనివాసరావుపై దాడి కూడా సొంత పార్టీలోనే చర్చనీయాంశమైంది. దాడికి కారణం భూ వివాదమని ఒక వర్గం, ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దందాపై ఫిర్యాదు చెయ్యడమే కారణమని మరోవర్గం చెబుతుండటం పెదకూరపాడు టీడీపీలోని పరిస్థికి అద్దం పడుతోందంటున్నారు పరిశీలకులు. ఇవన్నీ చాలవన్నట్టు ఇటీవల అమరావతిలో ఎమ్మెల్యే ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ ఇంకా వివాదాస్పదమయ్యాయి. నేను మంచి చెయ్యలేకపోయినా ఎవరికీ చెడు చెయ్యలేదు… గుడ్డకాల్చి మీదేసేవారికి దేహశుద్ధి చెయ్యండి… తప్పుగా మాట్లాడితే పడేసి కొట్టండి… నేను మీకు అండగా ఉంటానంటూ ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారాయన. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి… కొట్టండి, తన్నండని అనుచరుల్ని ప్రోత్సహించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా…. ఒకటి కాదు, రెండు కాదు… రకరకాలుగా పెరుగుతున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట భాష్యం ప్రవీణ్‌. ఇలాంటి వ్యవహారాలతో ఆయన పలుకుబడి పలుచన అవుతోందని కూడా మాట్లాడుకుంటున్నారు.

ఇక కొంతమంది స్థానిక నేతలకు ఎమ్మెల్యే తీరు అస్సలు మింగుడుపడడం లేదట. ఇవన్నీ కలగలిసి ఈ ఫస్ట్‌ టైమర్‌ని కంగారు పెడుతున్న క్రమంలో… ఓ ఫ్లాష్‌లాంటి ఐడియా వచ్చేసిందట. యాన్‌ ఐడియా కెన్‌ ఛేంజ్‌ మై కెరీర్‌ అనుకుంటూ… కాళ్ళకు పని చెప్పారట సార్‌. తన మీద పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడాని వంద రోజులు వంద గ్రామాల పేరుతో పాదయాత్ర మొదలుపెట్టేశారు. రోజుకో గ్రామంలో పర్యటిస్తూ సమస్యలేంటో అడిగి తెలుసుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే… ఈ యాత్రకు మరో కారణం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నరలోనే భాష్యం ప్రవీణ్‌ గ్రాఫ్‌ నేల చూపులు చూస్తున్న విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. దీంతో పెద్దలు ఆయన్ని పిలిచి నియోజకవర్గంలో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది…. ఇప్పుడే సరిదిద్దుకోమంటూ స్మూత్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలిసింది. దెబ్బకు అలర్ట్‌ వంద రోజుల ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారన్నది ఇంకో వెర్షన్‌. కారణం ఏదైనా ఆయన టూర్‌తో సమస్యలు పరిష్కారం అయితే అదే పదివేలని అనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు.

READ ALSO: YouTube: యూట్యూబ్‌లో కొందరికి కోట్లు.. మరికొందరికి జీరో! అసలు కారణం ఇదే..

Exit mobile version