Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?

  • ఆత్మకూరు వర్గ రాజకీయాలు, పైచేయి కోసం మంత్రి తంటాలు
  • వైసీపీ అభ్యర్థిని టీడీపీలో చేర్చుకుని దెబ్బ కొట్టే ప్రయత్నం
  • నియోజకవర్గ టీడీపీ నేతలే మంత్రిని తిప్పలు పెడుతున్నారా?
  • వెనక్కి తగ్గిన వైసీపీ అభ్యర్థులకు టీడీపీలోని మరో వర్గం సపోర్ట్‌?
  • తగ్గొద్దు, ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారా?
  • మున్సిపాలిటీలో జనసేన రెబెల్స్‌ను కూడా రెచ్చగొట్టారా?
  • బీఫామ్స్‌ పంపిణీలో ఆక్రోశం వెళ్ళగక్కిన మంత్రి ఆనం
  • నేను తలెత్తితే తట్టుకోలేరంటూ పార్టీలోని ప్రత్యర్థులకు వార్నింగ్‌
  • వాళ్ళు, వీళ్ళు కలిసి ఫైనల్‌గా ఆత్మకూరులో టీడీపీని ముంచుతారా?
Off The Record

Off The Record

Off The Record: సింహపురి పాలిటిక్స్‌లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికో పేజీ ఉంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఏ పార్టీలో ఉన్నా… తన అనుచరులను కాపాడుకుంటూ వస్తారనేది అందరూ చెప్పే మాట. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో తన వ్యూహాలతో ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు వైసీపీకి చివరి నిమిషం వరకు ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దొరక్కుండా కూడా గేమ్‌ ఆడారన్నది లోకల్‌ టాక్‌. వైసీపీ నేత, జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వదిన షకీలా రెడ్డిని లాస్ట్‌ మినిట్‌లో టీడీపీలోకి ఆహ్వానించి పార్టీ తరపున ఛైర్మన్‌ టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో… అప్పటిదాకా ఆమే తమ అభ్యర్థి అనుకున్న ప్రతిపక్షం కంగుతిందట. విపక్షం ఆలోచనను ముందే పసిగట్టిన మంత్రి… వ్యూహాత్మకంగానే షకీలారెడ్డిని టీడీపీలో చేర్చుకున్నట్టు చెప్పుకుంటున్నారు. తన వదిన టీడీపీ కండువా కప్పుకోవడంతో… వైసీపీ నేత బొమ్మిరెడ్డి కూడా ఏం చేయలేక చెన్నైకే పరిమితం అయినట్టు తెలుస్తోంది. అదంతా ఒక ఎత్తయితే… ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టాలనుకుంటున్న మంత్రితో అంతకంటే ముందే… సొంత వాళ్లే మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నారట. నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.

మంత్రి మీద ఉన్న కోపంతో.. వాళ్ళు ఏకంగా పార్టీనే బలహీనపరిచే కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఆనం అనుచరులు. ఈ ఎన్నికల్లో ఆయన్ని దెబ్బ కొట్టేందుకు తెర వెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారన్నది వాళ్ళ వెర్షన్‌. అందులో భాగంగా ఏకంగా వైసీపీ వాళ్ళకే సపోర్ట్‌ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. నామినేషన్స్‌ ఉపసంహరణకు సిద్ధమైన వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసేందుకు టీడీపీ నేత ఒకరు ముందుకు వచ్చారట.. మీ పార్టీ ఎలాగూ ఆర్ధిక వనరులు సమకూర్చదు. అదంతా నేను చూసుకుంటా. మీరు పోటీ నుంచి తప్పుకోవద్దంటూ ప్రత్యర్థులకే భరోసా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దాంతో పాటు ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన తరపున రెబల్ అభ్యర్థులను కూడా ఆ టీడీపీ నేతే రెచ్చగొట్టి బరిలోకి దింపారన్న ప్రచారం జరుగుతోంది. గ్లాస్‌ రెబెల్స్‌ని పోటీ నుంచి తప్పించేందుకు మంత్రి ఆనం ఎన్ని ప్రయత్నాలు చేసినా… వాళ్ళు ససేమిరా అన్నారట. నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధమైన వైసిపి ఎంపీటీసీలు వెనక్కి తగ్గడంతో పాటు జనసేన రెబల్ అభ్యర్థులు భీష్మించుకుని కూర్చోవడం వెనక టీడీపీ నేతలే ఉన్నారని తెలుసుకున్న ఆనం అరికాలి మంట నెక్కికెక్కిందట.

అదే సమయంలో తన వెనక గోతులు తీస్తున్న సొంత పార్టీ నేతకు… పార్టీ జిల్లా నాయకత్వం ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే నియోజకవర్గంలోని వర్గ విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేయడంలేదని ఫీలవుతున్నట్టు తెలిసింది. ఈ ఫ్రస్ట్రేషన్‌ మొత్తాన్ని మిక్స్‌ చేసి మిక్సీలో వేసి…తన అసహనాన్ని బీ ఫామ్స్‌ పంపిణీ కార్యక్రమంలో వెళ్ళగక్కినట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. పార్టీ ద్రోహులకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా నాయకత్వాన్ని ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. తాను తల దించుకుని రాజకీయాలు చేస్తున్నానని.. తలెత్తి చేస్తే ఎవరూ తట్టుకోలేరంటూ అందరి ముందే తన వ్యతిరేక వర్గానికి ఆనం హెచ్చరికలు జారీ చేయడం ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశమైంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం వ్యతిరేక వర్గం చేసే పనులు అందరికీ తెలిసినా.. అధిష్టానం పట్టించుకోవడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయించడం ఆనం వ్యతిరేక వర్గానికి నచ్చడం లేదంటున్నారు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అంటున్నారు ఆయన సన్నిహితులు. పార్టీ మనుషులమని చెప్పుకుంటూనే.. పార్టీకి ద్రోహం చేస్తున్నారని.. అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నల్ని జిల్లా నాయకత్వానికి మంత్రి అనుచరులు సంధిస్తున్నారు. మొత్తంగా ఆత్మకూరు టిడిపిలోని వర్గ విభేదాలు సద్దుమణుకుతాయా లేక.. గోతులు తీసుకునే ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తంగా పార్టీనే ముంచుతారా అన్నది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.