Site icon NTV Telugu

అమిత్ షా బహిరంగ సభ పై అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ముఖ్య నేతలు

Amith

Amith

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 14న తెలంగాణ రానున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో పాల్గొనేందుకు వస్తున్నారు అమిత్ షా. వరంగల్ లో రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో, అంతకంటే దీటుగా సభను సక్సెస్ చెయ్యాలని కమలం నేతలు పట్టుదలగా వున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5 లక్షల మందిని తరలించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతి ఎన్నికల బూత్ కూ, ఈ సభలో ప్రాతినిధ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభ కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టెలీ కాన్ఫరెన్స్ లో నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు బండి సంజయ్. కానీ ఇప్పటి వరకు అమిత్ షా సభకు సంబంధించి బిజెపి కోర్ కమిటీ సమావేశం కాలేదని, మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లపై పై చర్చించలేదని ప్రచారం జరుగుతోంది

పార్టీ లోని కొందరు ముఖ్య నేతలు ఈ సభకు సంబంధించి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చిన్న కార్యక్రమం ఉన్నా, రివ్యూలు పెట్టే ఆ నేతలు, అమిత్ షా సభపై మాట మాత్రంగానైనా స్పందించడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది

ఈమధ్యనే గడ్కరీ ప్రోగ్రాంని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అనేక సమీక్షలు చేశారు. గ్రేటర్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. జన సమీకరణపై ప్రత్యేక శ్రద్ద చూపారు. అయితే, అమిత్ షా కార్యక్రమంపై, ఆయన ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదని సమాచారం

OBC మొర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా అమిత్ షా టూర్ పై, నేతలతో ఇప్పటి వరకు మాట్లాడలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మురళీధర్ రావు కూడా అంతగా ద్రుష్టిపెట్టలేదట.

ఈ ముగ్గురు నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిజెపి కీలక నేతలతో మాట్లాడగలిగే చనువు ఉంది. వీరు చెబితే, కిందిస్థాయి నేతలు వింటారు. కానీ వారు షా సభ విషయంలో మాత్రం, అంటీ ముట్టనట్టు ఉన్నారని, పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ గా ఉండే నేతలంటున్నారు. ఆర్థిక వనరులకు సంబంధించి కానీ, జన సమీకరణకు సంబంధించికానీ స్పందించ లేదట. వీరే కాదు, కోర్ కమిటీలోకి వచ్చే ఇతర నేతలు కూడా హడావుడి చేయడం లేదు. తమతమ జిల్లాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, ఏమేరకు పని చేయాలో, ఆ మేరకు చేయడం లేదట. ఏదో నామ్ కే వాస్తేలా వ్యవహరిస్తున్నారట

అమిత్ షా సభకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయినా ఈ ముగ్గురు నేతలు రంగంలోకి దిగలేదు. బండి సంజయ్ అన్ని జిల్లాల నేతలతో మాట్లాడుకుంటున్నారు. అమిత్ షా సభ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వనరుల సమీకరణ కూడా ఆయనే చూసుకుంటున్నారట. అయితే, అమిత్ షా సభపై అంతగా ద్రుష్టి పెట్టకపోవడానికి సదరు నేతలు వేరే కారణాలు వుండొచ్చని పార్టీలో హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది

కోర్ మీటింగ్ పై బండినే చొరవ తీసుకోలేదని పార్టీలో చర్చఎవరైనా ముఖ్య నేతల సభలు, సమావేశాలు వున్నప్పుడు, కోర్ కమిటీ మీటింగ్, ముఖ్య నేతల భేటీలు పెట్టాల్సింది రాష్ట్ర అధ్యక్షుడే అంటున్నారు కొందరు లీడర్లు. అందరితో చర్చించి, బాధ్యతలు అప్పగించాల్సింది ప్రెసిడెంటేనని, మరి బండి సంజయ్ ఆ మేరకు చొరవ తీసుకున్నారా లేదా అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి అమిత్ షా సభ సక్సెస్ కోసం పార్టీ లోని ముఖ్యనేతలందరూ, సమిష్టిగా పని చెయ్యడంలేదన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

 

Exit mobile version