Site icon NTV Telugu

Alair MLA Target: నిధులు లేకున్నా హడావిడి

నిధులు లేకున్నా పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. వాటికి భారీగా ప్రచారాలు చేసుకోవడం ఇప్పుడు చిక్కొచ్చి పడింది. స్వపక్షానికి.. విపక్షాలకు ఆ ఎమ్మెల్యే టార్గెట్‌ అయ్యారు. కాసులు లేకుండా కితకితలెందుకని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

నిధులు లేకుండా అభివృద్ధి పనులకు భూమి పూజలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ మధ్య ఆలేరులో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తమ గ్రామాలకు రావడంపై కేడర్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నా.. అభివృద్ధి పనులకు ఆమె చేస్తున్న శంకుస్థాపనలే చర్చగా మారాయి. నిధులు లేకుండానే పనులకు భూమి పూజలు చేస్తున్నారని.. చిత్తశుద్ధి లేని శివపూజ వల్ల లాభం ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు.

సర్పంచ్‌లపై శిలాఫలకాల ఖర్చు భారం
ఆలేరు అభివృద్ధిపై సునీతకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. మొదట నిధులు సమకూర్చి.. వర్క్‌ ఆర్డర్స్‌ ఇచ్చి శంకుస్థాపనలు చేస్తే బాగుంటుందని సర్పంచ్‌లు సెటైర్లు వేస్తున్నారట. భూమి పూజలు చేసిన పనులు పూర్తవుతాయో లేదో అనే టెన్షన్‌ ఒకవైపు ఉంటే.. మరోవైపు ఆ పనుల శిలాఫలకాల ఏర్పాటు ఖర్చు సర్పంచ్‌లపైనే వేస్తున్నారట ఎమ్మెల్యే. ఎంత లేదన్నా ఒక్కో శిలాఫలకానికి ఇతర ఖర్చులకు దాదాపు లక్ష వరకు చేతి చమురు వదిలిపోతోందట. ఇది కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం పెరగడానికి కారణంగా చెబుతున్నారు పార్టీ నాయకులు.

జీవో వచ్చినా.. నిధులు రాలేదని విపక్షాల విమర్శ
ఈ విమర్శల జాబితాలో ప్రతిపక్షాలు కూడా చేరిపోయాయి. ఫండ్స్‌ లేకుండా పనులకు శంకుస్థాపన చేసి ఎవరి చెవిలో పూలు పెడతారని మండిపడుతున్నారు విపక్ష పార్టీల నేతలు. అధికారుల నుంచి కూడా సరైన సమాధానం సర్పంచ్‌లకు రావడం లేదట. నిధులు వస్తాయో రావో చెప్పాలని ప్రశ్నిస్తే మౌనంగా ఉండిపోతున్నారట ఆఫీసర్లు. ఆ మధ్య వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆధారంగా ఎమ్మెల్యేలు అడుగులు వేస్తున్నట్టు అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు 25 లక్షలు చొప్పున ఇస్తానని నాడు కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన జీవో వెంటనే జారీ అయినప్పటికీ.. నిధులు రాలేదన్నది విపక్షాల ఆరోపణ.

పీకే సర్వే భయంతోనే శంకుస్థాపనలు
గతంలో కూడా నిధుల్లేని జీవోలు చాలా వచ్చాయని… అది తెలిసి కూడా ఎమ్మెల్యే సునీత హడావిడి చేయడం నవ్వులు తెప్పిస్తోందని ఆలేరు జనం కామెంట్స్‌ చేస్తున్నారట. ఇదే సమయంలో మరో చర్చ కూడా ఆలేరులో జరుగుతోంది. ప్రశాంత్‌ కిశోర్‌ సర్వే కారణంగానే నియోజకవర్గంలో సునీత విస్తృతంగా పర్యటిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. కేవలం పర్యటనలు చేస్తే బాగోదని అనుకున్నారో ఏమో.. ఊళ్లల్లో అభివృద్ధి పనులు చేపడుతూ కొబ్బరికాయ కొట్టేస్తున్నారట. మొత్తానికి ఎమ్మెల్యే లెక్కలు ఎలా ఉన్నా.. స్వపక్షంలోనూ విపక్షంలోనూ జోక్స్‌ మాత్రం ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.

Exit mobile version