Site icon NTV Telugu

ఏపీ టీడీపీలో అచ్చెన్న వర్సెస్‌ కళా వెంకట్రావు..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు.. మాజీ అధ్యక్షుడి మధ్య వార్‌ నడుస్తోందా? పార్టీ నుంచి బహిష్కరించిన నేతకు ప్రాధాన్యం ఇవ్వడంతో నిప్పు రాజుకుందా? శ్రీకాకుళం టీడీపీలో హాట్‌ టాపిక్‌గా మారిన సంఘటనలు ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

కళా వెంకట్రావు వ్యతిరేక వర్గానికి అచ్చెన్న దన్ను..?

అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు. కళా వెంకట్రావు.. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పైకి నవ్వుతూ కనిపించినా.. ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ ఉందన్నది పార్టీలో అందిరికీ తెలిసిందే. కళా వెంకట్రావును ఇబ్బంది పెట్టేందుకు అచ్చెన్న సర్వశక్తులు ఒడ్డుతున్నారని జిల్లాలో హాట్ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కొంతకాలంగా ఎచ్చెర్లలో కళాకు వ్యతిరేకంగా ఉన్న కొందరు చోటామోటా లీడర్లను అచ్చెన్న ఎంకరేజ్‌ చేస్తున్నారట. అచ్చెన్న ఎంకరేజ్‌ చేస్తున్నవారిలో టీడీపీ నుంచి బహిష్కరణ వేటుపడ్డవాళ్లు కూడా ఉన్నారట.

తమలాంటి వారి పరిస్థితి ఏంటని కేడర్‌ ప్రశ్న..!

ఇటీవల జిల్లాలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమంలో పార్టీ నుంచి బహిష్కరించిన ఓ నాయకుడు అచ్చెన్నతో రాసుకుని పూసుకుని తిరిగారట. అది చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి టీడీపీ బ్యానర్‌పైనే కార్యక్రమాలు చేపడుతున్నారట. దీంతో అతడికి టీడీపీ సంబంధం లేదని అప్పట్లో ప్రకటన జారీ చేశారు. అయినా అతను ఆగడం లేదట. ఇప్పుడు అచ్చెన్నతో అంటకాగడంతో చర్చగా మారింది. కళా వెంకట్రావు విషయంలోనే ఇలా చేస్తే.. ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట.

చంద్రబాబు దీక్షకు వచ్చిన బహిష్కృత నేత

ఇటీవల చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు ఆ బహిష్కృత నేత హాజరయ్యాడు. చంద్రబాబుకు 50 వేలు విరాళంగా ఇచ్చారట. అయితే ఆ నేతను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మాస్క్‌ ధరించి వేదిక మీదకు వచ్చేలా ప్లాన్‌ చేశారట. దీనికి కూడా అచ్చెన్న అండదండలు ఉన్నట్టు జిల్లాలో టాక్‌. పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తిని ఏకంగా టీడీపీ ఆఫీస్‌లోకి తీసుకురావడం.. చంద్రబాబు దీక్షా వేదిక దగ్గరకు పంపడం మామూలు విషయం కాదని అనుకుంటున్నారు. ఈ ఎపిసోడ్‌లో మరో కొసమెరుపు కూడా ఉంది. అమరావతి నుంచి శ్రీకాకుళానికి తిరిగి వెళ్లాక ఆ బహిష్కృత నేత మరింత రెచ్చిపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్‌ కళాకు కాకుండా తనకే వస్తుందని ఓపెన్‌గానే ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. దాంతో అచ్చెన్న, కళా వెంకట్రావుల మధ్య ఈ వర్గపోరు ఎక్కడికి దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు.

Exit mobile version