2025లో ప్రపంచం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించింది. ప్రకృతి విపత్తులు ఇక అరుదైన ఘటనలు కావు. అవి షెడ్యూల్ ప్రకారం వస్తున్నాయి. ఒక నెల ఎండతో కాలిపోతే.. మరో నెల నీటిలో మునిగిపోతోంది. ఒక ఖండంలో అగ్ని రాజుకుంటే.. మరో ఖండంలో సముద్రం నగరాల్లోకి దూసుకొస్తోంది. ఇది వాతావరణ మార్పు గురించి హెచ్చరికలు వినే దశ కాదు. ఆ దశ దాటిపోయింది. ప్రపంచం మొత్తం ఒకేసారి ఊపిరి ఆడని దృశ్యాలను చూసింది. భూమి పగిలిపోతుందేమో అనిపించే స్థాయిలో వేడి పెరిగింది.
అదే సమయంలో ఆ వేడితో ఉప్పొంగిన సముద్రాలు తుఫాన్లుగా మారి నగరాల మీద పడ్డాయి. అమెరికా నుంచి చైనా వరకు, భారత్ నుంచి ఫిలిప్పీన్స్ వరకు ప్రకృతి ఒకే భాషలో మాట్లాడింది. వరదలు ఎప్పుడూ లేని ప్రాంతాల్లోకి దూసుకెళ్లాయి. తుఫాన్లు ఇంతకుముందెప్పుడూ చూడని శక్తితో తీరాలను తాకాయి. సముద్ర ఉష్ణోగ్రత కేవలం ఒక డిగ్రీ పెరిగితే, తుఫాన్ల శక్తి పది రెట్లు పెరుగుతోంది. అంటే ఇది ప్రకృతి కోపం కాదు. ఇది ప్రకృతి సమతుల్యత పూర్తిగా మారిపోతుందని చెప్పడానికి ఓ పెద్ద సంకేతం. 2025లో మనం చూసిన ప్రతి విపత్తు ఒక హెచ్చరిక. ఇది మనిషి చర్యలకు ప్రకృతి ఇచ్చిన ప్రతిస్పందన. ఇక 2025 ఇలా ఉంటే, 2026 ఎలా ఉండబోతోందనే భయం కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది.
నిజానికి 2025లో సంభవించిన విపత్తులు ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. భూమి మొత్తం ఒకే సమయంలో దెబ్బతిన్నట్టు కనిపించింది. అమెరికాలో రికార్డు స్థాయి హీట్‌వేవ్స్ కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు కుప్పకూలాయి. అడవుల్లో చెలరేగిన అగ్ని మంటలు వారాల తరబడి ఆరలేదు. చైనాలో కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో నదులు ఎండిపోయాయి. అదే సమయంలో మరో ప్రాంతంలో వరదలు రైలు మార్గాలు, హైవేలను కొట్టుకుపోయేలా చేశాయి. భారత్‌లో ఎండల తీవ్రత కారణంగా పట్టణాల్లో ఉష్ణోగ్రతలు మానవ శరీరం తట్టుకోలేని స్థాయికి చేరింది. అదే ఏడాది మాన్సూన్‌లో కొన్ని రాష్ట్రాలు భారీ వరదల్లో మునిగిపోయాయి. ఫిలిప్పీన్స్‌లో వరుస తుఫాన్లు తీర ప్రాంతాలను ఒకదాని తర్వాత ఒకటి తాకాయి. ఇళ్లే కాదు, ఊర్లు కూడా మ్యాప్‌ల నుంచి మాయమయ్యాయి.
ఈ విపత్తులన్నింటిలో ఒక కామన్ లింక్ ఉంది. అది సముద్రాల వేడి. శాస్త్రవేత్తలు చాలా కాలంగా చెబుతున్న మాట 2025లో నిజమైంది. సముద్రాలు వేడెక్కుతున్న కొద్దీ, వాటిలో నిల్వ అయ్యే శక్తి పెరుగుతోంది. ఆ శక్తి తుఫాన్ల రూపంలో బయటకు వస్తోంది. అందుకే ఈ ఏడాది తుఫాన్లు కేవలం ఎక్కువగా మాత్రమే కాకుండా, మరింత శక్తివంతంగా మారాయి. గాలుల వేగం, వర్షాల తీవ్రత, తీర ప్రాంతాలపై ప్రభావం లాంటి అంశాలు గతంతో పోలిస్తే అసాధారణంగా పెరిగాయి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత ప్రమాదకరమో 2025 స్పష్టంగా చూపించింది.
భూమి వేడి పెరగడం వల్ల ఎక్కడ వర్షం పడాలో అక్కడ పడటం లేదు. ఎక్కడ పడకూడదో అక్కడ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాలు ఎడారులుగా మారుతుంటే, మరికొన్ని ప్రాంతాలు ఏడాదంతా వరదల్లో మునిగిపోతున్నాయి. వ్యవసాయం దెబ్బతింటోంది. తాగునీటి వనరులు కలుషితం అవుతున్నాయి. కోట్లాది మంది జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది. ఇక 2025లో ఎండలు కేవలం అసహనంగా మాత్రమే లేవు. అవి ప్రాణాంతకంగా మారాయి. ప్రపంచ వాతావరణ సంస్థల డేటా ప్రకారం, ఈ ఏడాది అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులను దాటాయి.
కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు మానవ శరీరం తట్టుకోలేని స్థాయిని దాటాయి. అమెరికా, దక్షిణ యూరప్, దక్షిణ ఆసియాలో వరుసగా వారాల పాటు తీవ్రమైన హీట్‌వేవ్స్ నమోదయ్యాయి. భారత్‌లో మాత్రమే కాదు, చైనా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో కూడా రోజువారీ జీవితం నిలిచిపోయిన సందర్భాలు కనిపించాయి. ఇటు వేడి పెరిగిన కొద్దీ నీటి వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం అసమానంగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి వర్షం పడలేదు. మరోవైపు కొన్ని దేశాల్లో ఒకే రోజులో నెలల వర్షం కురిసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో అనేక నగరాలు వరదల్లో మునిగిపోయాయి. ఐక్యరాజ్యసమితి సంస్థల అంచనాల ప్రకారం వరద నీరు తగ్గిన తర్వాత కూడా సమస్యలు ఆగలేదు. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. పంట భూములు పనికిరాని స్థితికి చేరాయి. వ్యాధులు వ్యాపించాయి.
మరోవైపు తుఫాన్ల విషయంలో 2025 మరింత ప్రమాదకరంగా మారింది. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో తుఫాన్ల సంఖ్య మాత్రమే కాదు, వాటి తీవ్రత కూడా పెరిగింది. క్యాటగిరీ-4, క్యాటగిరీ-5 స్థాయి తుఫాన్లు గతంతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం ఒక్కటే. సముద్రాల ఉష్ణోగ్రత. ఈ ఏడాది సముద్రాల సగటు ఉష్ణోగ్రతలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. సముద్రాలు వేడెక్కిన కొద్దీ వాటిలో నిల్వ అయ్యే శక్తి పెరుగుతుంది. ఆ శక్తే తుఫాన్లకు ఇంధనంగా మారుతోంది. అందుకే ఈ ఏడాది తుఫాన్లు తీరాలను తాకినప్పుడు కేవలం గాలులతో కాదు.. భారీ వర్షాలతో, సముద్రపు అలలతో కలిసి విధ్వంసం సృష్టించాయి.
ఈ విపత్తుల మధ్య మనిషి చెల్లించిన ధర చాలా పెద్దది. వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్ల మంది జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు, జీవనోపాధి దెబ్బతిన్న రైతులు, మత్స్యకారులు, చిన్న వ్యాపారులు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కనిపించారు. అభివృద్ధి చెందిన దేశాలు అయినా, అభివృద్ధి చెందుతున్న దేశాలు అయినా ప్రకృతి ముందు సమానంగానే బలహీనంగా నిలబడ్డాయి. డబ్బు, సాంకేతికత, మౌలిక వసతులు ఉన్నా కూడా, ఈ తీవ్రత ముందు అవి సరిపోలేదు.
ఈ ఏడాది కొన్ని విపత్తులు తమ పేర్లతోనే చరిత్రలో నిలిచిపోయాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన హరికేన్‌లు తీర ప్రాంతాలను ధ్వంసం చేశాయి. పసిఫిక్‌లో వచ్చిన సూపర్ టైఫూన్లు ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్‌లను వరుసగా తాకాయి. భారత మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్లు తీర ప్రాంతాల్లోని గ్రామాలను ఖాళీ చేయించాల్సిన పరిస్థితిని తెచ్చాయి. యూరప్‌లో వేసవిలో చెలరేగిన అడవి మంటలు కొన్ని దేశాల్లో వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని నాశనం చేశాయి. ఇవి ఒక్కో ఘటనగా చూసినా భయంకరమే. కానీ అన్నీ ఒకే ఏడాదిలో జరగడం అసలు ఆందోళన కలిగించే విషయం.
ఇక ఈ విపత్తుల వల్ల జరిగిన ఆర్థిక నష్టం కూడా అపారమైనది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం, 2025లో వాతావరణ విపత్తుల వల్ల ప్రపంచానికి వందల బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది. ఇది కేవలం భవనాలు, రోడ్లు, మౌలిక సదుపాయాల నష్టం మాత్రమే కాదు. ఇది కోల్పోయిన పంటలు, ఆగిపోయిన వ్యాపారాలు, కోలుకోడానికి పట్టే సంవత్సరాల కథ. పేద దేశాలకు ఇది మరింత ఘోరం. ఎందుకంటే అక్కడ ఒక్క విపత్తు వచ్చినా, దాని ప్రభావం తరతరాల వరకు ఉంటుంది. ఈ ఏడాది గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. వాతావరణ మార్పు ఇక భవిష్యత్తు సమస్య కాదు. ఇది ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా ప్రవేశించింది.
అటు అడవుల్లో చెలరేగిన అగ్ని కారణంగా లక్షల హెక్టార్ల చెట్లు కాలిపోయాయి. అనేక జంతు జాతులు తమ నివాసాలను కోల్పోయాయి. సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కోరల్ రీఫ్‌లు తెల్లబడిపోయాయి. మొత్తం సముద్ర ఆహార గొలుసు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. పక్షులు వలస మార్గాలు మార్చుకుంటున్నాయి. ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 2025ను కేవలం ఒక చెడు సంవత్సరంగా తేల్చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్న మాట ఒకటే. ఈ ఏడాది జరిగిందంతా శాంపిల్ మాత్రమే. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేగం ఇలాగే కొనసాగితే, ఇలాంటి విపత్తులు మరింత తరచుగా, మరింత తీవ్రంగా జరుగుతాయి. అంటే 2025 ఒక హెచ్చరిక మాత్రమే. అసలు పరీక్ష ఇంకా ముందుంది.
అప్పుడు తప్పించుకోలేని ప్రశ్న ఒక్కటే మిగులుతుంది. 2026లో మనం ఏ ప్రపంచాన్ని చూడబోతున్నాం? 2025లో చూసిన ఎండలు, వరదలు, తుఫాన్లు ఇంకా శక్తివంతంగా మారుతాయా? లేదా మనం ఇప్పటికైనా మార్పు వైపు అడుగేస్తామా? ప్రకృతి ఇప్పటికే తన దారి మార్చుకుంటే, మనిషి తన దారిని మార్చుకోగలడా? 2025 సమాధానాలు ఇవ్వలేదు. కానీ ప్రశ్నలను మాత్రం చాలా స్పష్టంగా వదిలి వెళ్లింది.