PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి ఈ రోజులో 75 ఏళ్లు నిండాయి. రష్యా, ఇటలీ, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, ఇజ్రాయిల్ దేశాధినేతలు తమ శుభాకాంక్షలను స్వయంగా మోడీకి తెలియజేశారు. అయితే, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క దేశం మాత్రం, మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలని చూస్తోంది. ఆ దేశం మరేదో కాదు, మన పొరుగుదేశం పాకిస్తాన్. మోడీని పాకిస్తాన్ ఒక ‘‘దుర్వార్త’’గానే చూస్తోంది. ఆ దేశానికి చెందిన సెలబ్రిటీలు కూడా మోడీ ఉన్నంత కాలం, భారత్‌తో ఇలాగే ఉంటుందని పలు టీవీ డిబేట్లలో పేర్కొనడం గమనార్హం.
పాకిస్తాన్‌తో సంబంధాలు మోడీకి ముందు, మోడీకి తర్వాత అన్నట్లుగా మారాయి. గతంలో పాకిస్తాన్ ఎన్ని ఉగ్రవాద దాడులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కానీ దౌత్య సంబంధాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునే ప్రయత్నం చేయలేదు. పాకిస్తాన్ పట్ల విదేశాంగ విధానంలో ఎలాంటి మార్పలు చేయలేదు. పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వం ఉన్నా, సైనిక ప్రభుత్వం ఉన్నా దౌత్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కొన్ని సార్లు బ్యాక్-ఛానెల్ దౌత్యం ద్వారా రెండు దేశాలు సంబంధాలు నెరిపాయి.
మోడీ రాకతో మారిన వ్యవహారం:
2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, స్వయంగా అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో శుభకార్యం ఉంటే లాహోర్ వెళ్లాడు. పాక్‌కి స్నేహ హస్తం చాచారు. కానీ, యథావిధిగా పాకిస్తాన్ తన బుద్ధి చూపిస్తూనే ఉంది. పఠాన్ కోట్, ఉరీ, పుల్వామా, పహల్గామ్ ఇలా ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉంది.
ఇన్నాళ్లు పాకిస్తాన్‌కు ఓ ధీమా ఉండేది. భారత్‌పై దాడి చేస్తే, పాకిస్తాన్‌ను నిందించడం, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోరనే ఆలోచనతో ఉండేది. కానీ, మొదటిసారిగా ఉరీ దాడి తర్వాత, భారత సైన్యం పీఓకేలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ చేసింది. తాజాగా, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్ అంతటా పాక్ సైన్యం ఎయిర్ బేసులతో పాటు, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.
ఇలా భారత్ ప్రతీకారం తీర్చుకోవడం అనేది, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరుగుతుండటంతో పాకిస్తాన్, ప్రస్తుత ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్, రాహుల్ గాంధీలను పాక్ నాయకులు, ఆ దేశ సెలబ్రిటీలు ప్రశంసించడం చూస్తుంటే, అప్పటి యూపీఏ హయాంలోనే మా పరిస్థితి బాగుండేది అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
పాకిస్తాన్‌తో 1965, 1971, 1999 కార్గిల్ వార్ సమయాల్లో కూడా మన దేశం పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను ఎప్పుడూ పూర్తిగా తెంచుకోలేదు. పాక్‌కి ఆధారమైన ‘‘సిందూ నది ఒప్పందం’’ను ఎప్పుడూ నిలుపుదల చేయలేదు. కానీ మోడీ వచ్చిన తర్వాత దాయాదికి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించవు’’ అని చెప్పి, సిందూ ఒప్పందాన్ని నిలిపేశారు. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ లో హాహాకారాలు మొదలయ్యాయి. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగే ప్రసక్తే లేని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగవని చెప్పారు.
భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ:
మోడీ రాకతో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, పాక్ కవ్వింపులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి అనుమతులు అక్కర లేకుండా వెంటనే నిర్ణయం తీసుకునే వెసులుబాటు సైన్యానికి కల్పించారు. గతంలో సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరపడం, మన సైనికుల్ని అపహరించి తలలు నరికిన సందర్భాలు ఉన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాక్ యాక్షన్‌కు అంతకన్నా సీరియస్ రియాక్షన్ ఉంటుందని తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. దీంతో సైన్యం కూడా పాక్‌ని ఎప్పటికప్పుడు దెబ్బతీస్తుంది. ఇన్నాళ్లు, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసేది, ఆపరేషన్ సిందూర్‌తో ఇక ఈ బ్లాక్‌మెయిల్‌ని సహించేది లేదని భారత్ స్పష్టం చేసింది. పాక్ అణ్వాయుధాలు నిల్వ చేస్తారనే ప్రచారం ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసి గట్టి సందేశం ఇచ్చింది. ప్రధాని మోడీ కూడా ఇక పాక్ అణ్వాయుధ బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు.
మోడీ అధికారం పోవాలని పాక్ ఆశ:
ముంబై ఉగ్రదాడుల సమయంలో భారత్ వైఖరి, కాంగ్రెస్ ప్రతిస్పందనతో పోలిస్తే మోడీ వచ్చాక కాస్త మార్పు వచ్చిందని దేశ ప్రజలే చెబుతున్నారు. అయితే, పాకిస్తాన్ ప్రజలు, అక్కడి నేతలు మోడీ ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారు. మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటున్నట్లు పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి అన్నారు. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, సిట్టింగ్ ఎంపీలు పదే పదే మోడీని విమర్శి్స్తున్నారు.
మోడీ దిగిపోతేనే భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడుతాయని అనే వారు కూడా ఉన్నారు. షాహీద్ అఫ్రిది వంటి పాక్ మాజీ ప్లేయర్ కూడా మోడీ ఉంటే కష్టమని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా, ఆయన రాహుల్ గాంధీని పొడుగుతూ పాక్ మీడియాలో మాట్లాడటం కూడా వైరల్ అయింది. పాక్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ కర్ మాట్లాడుతూ.. మోడీ వచ్చిన తర్వాత పాకిస్తాన్‌పై ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడ అంటే అక్కడ దాడి చేస్తున్నారని చెప్పారు. చివరకు పాక్ ఉగ్రవాదులు కూడా మోడీకి వార్నింగ్ ఇస్తూ మాట్లాడటం ప్రారంభించారు. దీనిని బట్టి చూస్తే, మోడీ పాకిస్తాన్‌ను ఎలా భయపెడుతున్నాడో అర్థం అవుతోంది.
