Site icon NTV Telugu

Internet: యుద్ధం ఎఫెక్ట్.. ఇండియాకు ఇంటర్నెట్ కట్..!? తెరపైకి కొత్త భయాలు!

Internet Cut Down

Internet Cut Down

ఎక్కడో జరుగుతున్న ఒక యుద్ధం.. మన మొబైల్‌ ఫోన్లలో నెట్‌ ఆగిపోవడానికి కారణమవుతుందా?
హార్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచానికి చమురు ఆగిపోతుందని తెలుసు.. కానీ అదే మార్గం బ్లాక్ అవ్వడం కారణంగా ఇంటర్నెట్ లైన్లు కూడా కట్ అవుతాయా? వీడియో కాల్స్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు.. ఇలా మన రోజువారీ జీవితం మొత్తం ఒక్కసారిగా నెమ్మదిస్తే?

మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు ఒక కొత్త భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం చమురు యుద్ధం మాత్రమే కాదని.. ప్రపంచాన్ని కలిపే డిజిటల్ నాడికి కూడా ముప్పు ఉందనే సందేహం మొదలైంది. ఇంతకీ హార్ముజ్‌లో జరుగుతున్న ఈ ఉద్రిక్తత ప్రపంచ ఇంటర్నెట్‌ను ఎంతలా ప్రభావితం చేయగలదు?

హార్ముజ్ జలసంధి గురించి ఇప్పటివరకు మనం చమురు రవాణా కోణంలోనే ఎక్కువగా విన్నాం. కానీ అదే సముద్ర మార్గం కింద ప్రపంచాన్ని కలిపే అసలు నెట్‌వర్క్ ఉంది. సముద్రపు అడుగున వేల కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఫైబర్ కేబుల్స్ ఉన్నాయి. ఇవే మన ఇంటర్నెట్‌కు బ్యాక్‌బోన్.

మనం చేసే ప్రతి వీడియో కాల్, ప్రతి మెసేజ్, ప్రతి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఈ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. రెడ్ సీ, హార్ముజ్ లాంటి ప్రాంతాలు ఈ నెట్‌వర్క్‌లో కీలకమైన చోక్‌ పాయింట్స్‌ . ఈ రెండు మార్గాల మీదుగా యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య భారీ డేటా ట్రాఫిక్ వెళ్తుంది. రెడ్ సీ లోనే దాదాపు 17 కేబుల్స్ ఉన్నాయని అంచనా. హార్ముజ్ ప్రాంతంలో కూడా AAE-1, ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్, టాటా-టీజీఎన్ వంటి కీలక కేబుల్స్ ఉన్నాయి. ఇవి ఇండియాకు కూడా చాలా ముఖ్యమైన కనెక్షన్లు. ఇప్పుడు యుద్ధం ఈ ప్రాంతాలనే తాకుతోంది.

సముద్రంలో మైన్స్ వేయడం, నౌకలపై దాడులు జరగడం వల్ల ఈ మార్గాలు ప్రమాదకరంగా మారాయి. సాధారణంగా కేబుల్ దెబ్బతింటే ప్రత్యేక నౌకలు వెళ్లి వాటి మరమ్మతులు చేస్తాయి. కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో అలాంటి పనులు చేయడం చాలా కష్టం.

ఒకసారి కేబుల్ కట్ అయితే అది రోజులు కాదు, వారాలు కాదు.. కొన్ని సందర్భాల్లో నెలల పాటు కూడా పని చేయకపోవచ్చు. ఇది కేవలం సిద్ధాంతం కాదు. 2024లో రెడ్ సీ ప్రాంతంలో జరిగిన దాడుల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిన్నాయి. అప్పుడే ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ పడిపోయింది. పూర్తి స్థాయిలో రిపేర్ కావడానికి చాలా సమయం పట్టింది. అంటే ఇదే పరిస్థితి పెద్ద స్థాయిలో జరిగితే ప్రభావం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ రెండు చోక్ పాయింట్స్ ఒకేసారి ప్రభావితమైతే ప్రపంచవ్యాప్తంగా పెద్ద అంతరాయం కలగొచ్చు. అప్పుడు ఇంటర్నెట్ స్లో అవుతుంది, ట్రాన్సాక్షన్లు ఆలస్యం అవుతాయి. బ్యాంకింగ్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు, హాస్పిటల్స్, AI సిస్టమ్స్ లాంటివి ఈ కనెక్షన్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ నిజంగా ఈ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటుందా అనేది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేం కానీ.. అవకాశమైతే ఉంది.

హార్ముజ్ ప్రాంతంలో నీటి లోతు తక్కువగా ఉండటం, అక్కడ ఇప్పటికే మిలిటరీ కార్యకలాపాలు జరుగుతుండటం వల్ల రిస్క్ మాత్రం పెరిగింది. ఇప్పటికైతే కేబుల్స్ పనిచేస్తున్నాయి. కానీ పరిస్థితి రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతోంది. మొత్తానికి ఈ యుద్ధం ఇక చమురు వరకు మాత్రమే పరిమితం కాదు… ప్రపంచాన్ని కలిపే డిజిటల్ లైఫ్‌లైన్‌కే ముప్పుగా మారే దశలోకి వెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది.

Exit mobile version