America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

Trump Iran Ultimatum explained

Trump Iran Ultimatum

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఇరాన్‌తో యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు రెండే మార్గాలే ఉన్నాయని.. అందులో ఒకటి గొప్ప శాంతి ఒప్పందమైతే.. రెండోది సైనికంగా ఇరాన్‌ను పూర్తిగా అంతం చేయడమని బాంబు పేల్చారు. ఈ ఒక్క ప్రకటనతో మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చర్చలు జరుగుతున్నాయా లేక మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా అనే ఆందోళన ఇప్పుడు ప్రపంచ దేశాలను వెంటాడుతోంది.

ఇరాన్‌-అమెరికా యుద్ధం కారణంగా ఎలాంటి నష్టం జరిగింది?

2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భారీ దాడులు ప్రారంభించాయి. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాలు లక్ష్యాలుగా మారాయి. ఈ యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుందనుకుంటే నెలల తరబడి కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేలాది మంది మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20శాతం వెళ్లే హార్ముజ్ జలసంధి యుద్ధం కారణంగా తీవ్ర ప్రభావానికి గురైంది.

చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. ఇక హార్ముజ్‌ను ఇరాన్ కంట్రోల్‌లో ఉంచుకోవడంతో అమెరికా దానికి ప్రతికారంగా ఇరాన్‌ నౌకలను బ్లాక్‌ చేసింది. ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలను అడ్డుకోవడం ప్రారంభించింది. 100కు పైగా వాణిజ్య నౌకలు తమ మార్గాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే యుద్ధం మధ్యలో చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ ఒకవైపు తాను గొప్ప ఒప్పందానికి దగ్గరలో ఉన్నానని చెబుతున్నారు. మరోవైపు చర్చలు విఫలమైతే సైనికంగా ఇరాన్‌ పని ఖతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

×
×
Ad

ఇరు పక్షాలు పెట్టిన డిమాండ్లు ఏంటి?

ఇక ఒప్పందం కోసం అమెరికా కొన్ని కీలక డిమాండ్లు పెట్టింది. ఇరాన్ వద్ద ఉన్న అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియంను పూర్తిగా తొలగించాలని కోరుతోంది. అది అమెరికాకు అప్పగించాలి లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయాలని చెబుతోంది. ఎందుకంటే అదే భవిష్యత్తులో అణు బాంబుల తయారీకి ఉపయోగపడుతుందనే భయం అమెరికాకు ఉంది. మరోవైపు ఇరాన్ కూడా తన షరతులు స్పష్టంగా చెప్పింది. అమెరికా తమపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమ హక్కులను అంగీకరించాలంటోంది. యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని.. మాటలతో కాదు చర్యలతో నమ్మకం చూపించాలని ఇరాన్ నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఇటీవల చేసిన మరో చర్య ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. హార్ముజ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన నౌకలు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తూ కొన్ని పరిమితులను సడలించారు. దీన్ని చర్చలకు అనుకూల సంకేతంగా విశ్లేషిస్తున్నారు. అయితే అదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మరింత కఠినంగా స్పందించారు.

ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా ఉండే ఒప్పందమే అమెరికా లక్ష్యమని చెప్పారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

ఇదే సమయంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో ఒక AI చిత్రాన్ని పోస్ట్ చేశాడు. అందులో సైనిక దుస్తుల్లో నిలబడ్డారు. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల మధ్య ఆయన కనిపించారు. నువ్వు పూర్తిగా గందరగోళానికి గురవుతున్నావు అనే అర్థం వచ్చే సందేశాన్ని కూడా జత చేశారు. దీంతో చర్చలు జరుగుతున్నాయా లేక మానసిక ఒత్తిడి పెంచే వ్యూహమా అనే చర్చ మొదలైంది. అసలు నిజంగానే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరబోతుందా.. లేక ఇది మరొక పెద్ద యుద్ధానికి ముందు కవ్వింపు చర్యలా అనే చర్చ ఊపందుకుంది.

ఒకవేళ యుద్ధం మరోసారి తీవ్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లో చిక్కుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రంప్ ఇచ్చిన రెండు ఆప్షన్లు ఇప్పుడు కేవలం అమెరికా, ఇరాన్‌కు సంబంధించినవి కావు..అవి ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే రెండు మార్గాలుగా మారిపోయాయని చెప్పవచ్చు.