ఇంకా నెక్స్ట్ ఎవరో ఫేమస్ అయ్యేది, వాళ్ళ గతి ఏంటో అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇందులో నిజం ఎంత, ప్రచారం ఎంత అనేది పరిశీలిస్తే, దాదాపు నిజమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే, సామాన్యులు సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్‌ని ఒక్కసారిగా తట్టుకోలేకపోతున్నారు. ఆ క్రేజ్ కారణంగా తమను తాము లెజెండ్స్‌గా భావిస్తూ, ఫాలోవర్స్ మీద విరుచుకుపడుతున్న ఘటనలు, అదే విధంగా తమ పైత్యాన్ని చూపిస్తూ వెధవలుగా మిగులుతున్న దాఖలాలు ఎక్కువ అవుతున్నాయి
నిజానికి, కుమారి ఆంటీ ఇష్యూ నుంచి పరిశీలిస్తే, ఆమె వండిన వంటలు అద్భుతమైనవి ఏమీ కాదు. కానీ, ఆమె ఫుడ్ స్టాల్‌కి వెళ్లి తినే వారిని పలకరిస్తున్న తీరు కారణంగా ఆమె యూట్యూబ్‌లో దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా ఫేమస్ అయింది. జనం క్యూ కట్టడంతో హోటల్ మోసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత రేవంత్ రెడ్డి చొరవ చూపినా, సరే, ఇప్పుడు హోటల్ అంతకు ముందులాగా అయితే రన్ అవుతున్న పరిస్థితి కనిపించడం లేదు.
ఇక బర్రెలక్క , కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ఒకే ఒక వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె తనను ఎక్కువగా ఊహించుకుని, ఏకంగా ఎన్నికల బరిలోకి దిగి, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడి, ట్రోలింగ్‌కి గురై, చివరికి కన్నీటి పర్యంతమై, తనను వదిలేయాలని విజ్ఞప్తులు చేసుకుంది.
ఇక, తన కెరీర్ అయిపోవడంతో ఎక్కడో రోజు తాగుతూ గడిపేసే రాకేష్ మాస్టర్‌ని యూట్యూబ్ ఛానల్స్ తమ పని కోసం వీడియో ఇంటర్వ్యూలు చేస్తూ ఒక్కసారిగా పైకి లేపాయి. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుని, తాగుడికి మరింత అలవాటై, చివరికి అదే తాగుడు కారణంగా మరణించే పరిస్థితి తెచ్చుకున్నాడు.
ఒక సాధారణ జ్యోతిష్యుడు వేణుస్వామిని సోషల్ మీడియా ఫేమస్ చేయడంతో, అతను ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిపోయాడు. “నేనేం చెప్పినా చెల్లుతుంది” అని భావించి, నాగచైతన్య, శోభిత జీవితం గురించి అవాకులు చవాకులు పేలి, అడ్డంగా బుక్కై, ఇప్పుడు సైలెంట్ అయ్యాడు.
పూసలమ్మే మోనాలిసా అనే అమ్మాయిని “అందమైన కళ్ళు, తేనెలూరే నయనాలు” అంటూ ఒక రేంజ్‌లో పైకి లేపడంతో, ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది. వెంటనే బాలీవుడ్‌లో దర్శకుడిగా చెప్పుకునే ఒక వ్యక్తి సినిమా తీస్తానని ముందుకు రావడం, అడ్వాన్స్ ఇవ్వడం, ఆ తర్వాత అతను రేప్ కేసులో జైలుకు వెళ్లడం జరిగిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అటు వెనక్కి వెళ్లి పూసలు అమ్ముకోలేక, అలాగని సినిమా అవకాశాలు రాక, ఇరకాటంలో ఉంది.
ఇక అఘోరీ అంటూ ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో పైకి లేపారు. యూట్యూబ్ ఛానల్స్ వరుస ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. నగ్నంగా తిరుగుతున్న వీడియోలను బ్లర్ చేసి మరి టెలికాస్ట్ చేశాయి. ఇప్పుడు అతను ఒక అమ్మాయిని లోబరుచుకుని వివాహం చేసుకొని చెక్కేశాడు.
ఇక ఆలేఖ్య చిట్టి పచ్చళ్ళ కథ మరో రకం. ముగ్గురు అక్కచెల్లెళ్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫేమస్ అయ్యారు. అందులో ఆలేఖ్య చిట్టి అనే అమ్మాయి మాత్రం పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టింది. నెగటివ్ ట్రోలింగ్ రావడంతో, “బూతుల పంచాంగం విప్పింది” అని ఆమె సోదరీమణులు చెబుతుంటే, “ఏకంగా వందమంది మీద బూతుల పంచాంగం విప్పాల్సిన అవసరం లేదు” అని మరి కొంతమంది అంటున్నారు.
మొత్తంగా, వీరంతా సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్ శాశ్వతమని భావించి, తమకు తెలియకుండానే సెల్ఫ్ గోల్స్ వేసుకొని, ఇప్పుడు కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి, సోషల్ మీడియా క్రేజ్ అనేది కూడా నడమంత్రపు సిరి లాంటిదే. అది ఉన్నప్పుడు రెచ్చిపోవడం, లేనప్పుడు చిక్కిపోవడం చేస్తే, జీవితానికి అర్థమే ఉండదు.