Site icon NTV Telugu

Pakistan: భారత్, ఇజ్రాయిల్‌లతో పాకిస్తాన్ డేంజరస్ గేమ్.. “ఇస్లామిక్ నాటో” ఏర్పాటు చేస్తోందా..?

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ చాలా డేంజరెస్ గేమ్ ఆడుతోంది. ఇస్లామిక్, అరబ్ దేశాల్లో ఉన్న భయాలను పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటోంది. ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాక్ వద్ద మాత్రమే అణు బాంబు ఉంది. ఈ బలంతో తాము ఇతర ఇస్లామిక్ దేశాలను రక్షిస్తామనే భ్రమను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సౌదీ అరేబియా వంటి దేశంతో ‘‘ రక్షణ ఒప్పందాన్ని’’ కుదుర్చుకుంది. తాజాగా, సోమాలియాతో ఇలాంటి ఒక ఒప్పందాన్నే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తూర్పు ఆఫ్రికా దేశమైన సోమాలియా, నౌక వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ‘‘హార్న్ ఆప్ ఆఫ్రికా’’కు దగ్గర ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది.

నివేదికల ప్రకారం, సోమాలియాతో పాకిస్తాన్ ఒప్పందం 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ ఒప్పందాన్ని సోమాలియా క్యాబినెట్ ఆమోదించింది. ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తన సైనిక కాలేజీలో సోమాలియా దళాలకు శిక్షణ ఇస్తుంది. పైరసీ నిరోధక కార్యకలాపాలకు సాయం చేస్తుంది. నేవీని ఏర్పాటు చేయడానికి సహాయపడుతుంది. సోమాలియ తీరంలోని వ్యూహాత్మక జలాల్లో ఇస్లామాబాద్ తన సైనిక, నిఘా ఉనికిని విస్తరించే లక్ష్యంతో టర్కీ సాయంతో సోమాలియాతో ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సౌదీ, అజర్ బైజాన్, టర్కీలతో ఒప్పందాలు:

పాకిస్తాన్ ఇప్పటికే పలు ఇస్లామిక్ దేశాలతో సైనిక ఒప్పందాలను కుదుర్చుకుంది. టర్కీ, అజర్ బైజార్‌లు పాకిస్తాన్‌కు ఆప్త మిత్రులుగా ఉన్నాయి. ఇటీవల భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ డ్రోన్లను ఇచ్చి మద్దతు ప్రకటించింది. అజర్ బైజాన్ బహిరంగంగా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. ఇటీవల, సౌదీ అరేబియాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నిజానికి ఈ దేశాలు సైనికంగా చిన్నవే అయినప్పటికీ, ఆర్థికంగా శక్తివంతంగా ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఈ దేశాల ఆర్థిక బలంతో మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంటుంది.

భారత్, ఇజ్రాయిల్‌పై ప్రభావం:

పాకిస్తాన్, ఇస్లామిక్ దేశాల ముఖ్యమైన టార్గెట్లు భారత్, ఇజ్రాయిల్‌లు. ఇటీవల ఇజ్రాయిల్ ఖతార్‌లోని హమాస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేసింది. ఖతార్, ఇజ్రాయిల్‌లు అమెరికాకు మిత్రదేశాలే. అయినప్పటికీ ఖతార్‌పై దాడి చేయడానికి ఇజ్రాయిల్ ఏమాత్రం భయపడలేదు. ఈ పరిణామాలే ఇస్లామిక్ అరబ్ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది.

ఖతార్‌పై దాడి తర్వాతే సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘‘ ఏ ఒక్క దేశంపై దాడి జరిగిన, రెండు దేశాలపై దాడి జరిగినట్లే’’ అని ఈ ఒప్పందం చెబుతోంది. భవిష్యత్తులో భారత్ వంటి దేశం పాకిస్తాన్‌పై దాడి చేస్తే సౌదీ కూడా యుద్ధంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నమాట. ఒక వేళ భారత్‌తో యుద్ధమే వస్తే, ఈ దేశాలు ఆర్థిక శక్తిని, ఇంధనాన్ని పాకిస్తాన్‌కు అందిస్తాయి. దీంతో పాకిస్తాన్‌కు భారత్ తో మరింత కాలం యుద్ధం చేసే శక్తి వస్తుంది.

ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు యత్నం:

ఇటీవల ఖతార్‌పై దాడి తర్వాత, దోహాలో అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకులు విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇజ్రాయిల్‌ను అడ్డుకునేందుకు ‘‘ఇస్లామిక్ నాటో’’ అవసరమని పలువురు దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. నాటో తరహాలో ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీని ద్వారా ఈ కూటమిలో ఉన్న ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, మిగతా దేశాలపై దాడి జరిగినట్లే భావించవచ్చు. ఇది భారత్‌కు, ఇజ్రాయిల్‌కు ఇబ్బందికర పరిస్థితి.

అంత ఈజీ కాదు:

పాకిస్తాన్ కలలు కన్నట్లు ఇస్లామిక్ నాటో అనేది అంత ఈజీ కాదు. భారత్ వంటి అతిపెద్ద దేశంతో పలు ఇస్లామిక్ దేశాలకు సత్సంబంధాలు ఉన్నాయి. యూఏఈ, సౌదీ, మలేషియా, ఇండోనేషియా దేశాలతో విస్తృత వ్యాపార సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కోసం ఈ దేశాలు వ్యాపారాన్ని కాదనుకునే పరిస్థితి లేదు. నిజానికి ఇస్లామిక్ దేశాల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఇరాన్ అంటే సౌదీ అరేబియాకు, ఖతార్ అంటే యూఏఈ, బహ్రైయిన్‌లకు పడదు. ఇవన్నీ ఒక్కతాటిపైకి వచ్చే అవకాశం చాలా తక్కువ.

అన్నీ గమనిస్తున్న భారత్:

ఇటీవల పాకిస్తాన్ తన ఆప్త మిత్రుడు చైనాను కాదని, అమెరికా పంచన చేరింది. అమెరికాతో కలిసి తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఇస్లామిక్ దేశాలతో సైనిక ఒప్పందాలను కూడా భారత్ ఓ కంట కనిపెడుతోంది.

ఇటీవల సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలను గమనించిన భారత్, పాకిస్తాన్ మరోసారి ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ప్రపంచ పటం నుంచి మాయం అవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. కరాచీపై దాడి చేస్తామని అన్నారు. ఇక ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్‌లు కూడా పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు.

Exit mobile version