NTV Telugu Site icon

Tollywood: బాలీవుడ్‎‎ని రఫ్ఫాడించిన టాలీవుడ్!

Bollywood Tollywood

Bollywood Tollywood

ప్రస్తుతానికి ఇండియన్ సినిమాను ఏలుతున్న ఇండస్ట్రీ ఏది అంటే.. అందరికీ గుర్తొచ్చేది ఒకే పదం. అదే టాలీవుడ్. ఇప్పుడైతే తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉంది.. కానీ ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా తక్కువగా చూసేవారు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగును పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి మన ఇండస్ట్రీకి తగినంత మర్యాద ఇవ్వలేదు అని ఒక సందర్భంలో బాధపడ్డాడు. బిగర్ ద్యాన్ బచ్చన్ అని పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి బాధపడ్డారంటేనే పరిస్థితి అర్థమవుతుంది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని సౌత్ సినిమా అంటే తమిళ్ ఇండస్ట్రీ అని భావించేవారు. తెలుగు, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల నుంచి వచ్చేవి అసలు సినిమాలే కాదు అన్నట్లు ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

సౌత్ ఇండస్ట్రీ అంటే తమిళ్ మాత్రమే కాదని.. తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలు ప్రూవ్ చేశాయి. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ సౌత్ సినిమాను మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాను ఏలుతోంది. ఈ సక్సెస్ ఎలా వచ్చింది. ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు. ఎన్నో అవమానాలు.. అన్నే నిరాశలు.. విశ్రమించకుండా పోరాడారు. అనుకున్న స్థాయికి చేరుకున్నారు. అండ్ హియర్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ది రైజ్ ఆఫ్ టాలీవుడ్.

టాలీవుడ్ ని అంత తక్కువగా ఉండటానికి కారణం ఏంటి..? మన దగ్గర గొప్ప సినిమాలు లేవా..? గొప్ప నటులు లేరా..? గొప్ప టెక్నీషియన్స్ లేరా..? ఎందరో ఉన్నారు. కానీ రావలసినంత గుర్తింపు మాత్రమే లేదు. భీష్మ ప్రతిజ్ఞ సినిమాతో మొదలైంది టాలీవుడ్ ప్రస్థానం. 12000 వేల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 60000 కలెక్ట్ చేసింది. ఇండియాలో మాత్రమే కాకుండా శ్రీలంక, బర్మా దేశాల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు మాత్రమే కాదు.. ఈ దేశానికి అందించింది. దేశం గర్వించ దగ్గ ఎన్నో సినిమాలు టాలీవుడ్ అందించింది. మాయాబజార్, దేవదాసు, మిస్సమ్మ, గుండమ్మ కథ, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఖైదీ, ఆదిత్య 369, శివ, స్వర్ణ కమలం, శంకరాభరణం వంటి ఎన్నో మాస్టర్ పీస్ లను టాలీవుడ్ ఇచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369. అప్పటివరకు హాలీవుడ్ లో మాత్రమే టైం ట్రావెల్ సినిమాలు ఉండేవి. ప్రపంచంలో మొట్ట మొదటి టైం ట్రావెల్ సినిమా ది టైం మెషిన్. 1895 లో హెచ్ జి వెల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యే ఆదిత్య 369 తెరకెక్కించారు. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించడమే కాదు.. ఇలా కొత్త విషయాలను కూడా ఇండియన్ సినిమాకు అందించింది టాలీవుడ్. మాయాబజార్ నుంచి బాహుబలి వరకు స్పెషల్ ఎఫెక్ట్స్ లో ఒక్కో మెట్టు ఎక్కింది. రామోజీ ఫిలిం సిటీ పేరుతో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫిలిం సిటీ టాలీవుడ్ సొంతం. ఇలా ఎన్ని విషయాల్లో ముందున్నా.. చిన్న చూపు.

ఇక నేషనల్ అవార్డ్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని శాఖల్లో తెలుగు ఇండస్ట్రీకి చాలా తక్కువ ఉన్నాయి. బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో తెలుగులో ఒకే ఒక్క సినిమాకు అవార్డు వచ్చింది అదే బాహుబలి. అంటే బాహుబలి కంటే ముందు తెలుగులో నేషనల్ అవార్డు కొట్టే సత్తా ఉన్న సినిమాలే లేవా..? మాయాబజార్ ఏమైంది. బెస్ట్ మూవీ విభాగంలో నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం 1953 లో స్టార్ట్ చేస్తే మాయాబజార్ 1957 లో రిలీజ్ అయ్యింది. మరి అలాంటి సినిమాకు నేషనల్ అవార్డు లేదా..? శంకరాభరణం, గీతాంజలి, స్వయంకృషి, రుద్రవీణ, ఇలా వందల సంఖ్యలో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కానీ బాహుబలి కంటే ముందు మనకు ఒక్క నేషనల్ అవార్డు కూడా లేదు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ విభాగానికి వస్తే తెలుగుకు 4 అవార్డ్స్ వచ్చాయి. 1979లో రిలీజ్ అయిన నిమజ్జనం సినిమాకుగాను నటి శారదకు, దాసీ సినిమాకు అర్చనకు, కర్తవ్యం సినిమాకు విజయశాంతికి, రీసెంట్ గా మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ కి అవార్డ్స్ వచ్చాయ్. మరి ఇంతకంటే గొప్పగా నటించిన వారు లేరా.. మహానటి సావిత్రికి నేషనల్ అవార్డు లేదా..? ఇక బెస్ట్ యాక్టర్ విభాగంలోకి వస్తే ఇక్కడ కూడా ఒక్కటే అవార్డు.. పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు వచ్చింది ఈ అవార్డు. అంటే 1967 నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేస్తే పుష్ప సినిమా వచ్చెనంత వరకు ఆ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిన నటుడే లేడా..? ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డు లేదు, ఏఎన్నార్ కు నేషనల్ అవార్డు లేదు, చిరంజీవి నేషనల్ అవార్డు లేదు. మరి నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్ లో మనవాళ్ళు నటించలేదా..? ఒక వేళ నటించినా.. బాలీవుడ్ వారికి మనం కనిపించలేదా..? బెస్ట్ యాక్టర్ విభాగంలో హిందీ నటులకు 25 అవార్డులు, మలయాళం నటులకు 14 అవార్డులు, తమిళ నటులకు 9, బెంగాలీ నటులకు 5, కన్నడ, మరాఠీ నటులకు 4, కానీ తెలుగుకు మాత్రం ఒక్కటే అవార్డు.

ఇలా ప్రతీ విషయంలో మనను తక్కువగానే చూశారు. ఒక సందర్భంలో ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడి బాధపడ్డారు. బాలీవుడ్ లో ఒక ఫంక్షన్ కి వెళ్లిన చిరంజీవికి.. ఇండియన్ సినిమా అనే పేరుతో బాలీవుడ్ నటుల ఫోటోలు వేసి.. సౌత్ సినిమా అని కేవలం ఎంజీఆర్, జయలలిత, ప్రేమ్ నజీర్ ల ఫోటో మాత్రమే వేశారని బాధపడ్డారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 2015 లో వచ్చిన ఒక్క సినిమా ఆ పరిస్థితులను పూర్తిగా మార్చేసి.. యావత్ భారతీయ సినీ పరిశ్రమను టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. అదే బాహుబలి. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత అన్ని మారిపోయాయి. సడన్ గా అందరూ మనకు మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా అన్న వారంతా ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అనడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి మనవాళ్ళు ఇంకా ఆగలేదు. అప్పటి నుంచి వరుసపెట్టి బాలీవుడ్ కి షాకులు ఇస్తూనే ఉన్నారు. బాహుబలి 2, హనుమాన్, పుష్ప, సాహో, సలార్, RRR, కల్కి.. ఇలా వరుసపెట్టి ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో టాప్ 6 లో మూడు తెలుగు సినిమాలే. తెలుగు దర్శకులు తీసిన వరుస ప్యాన్ ఇండియన్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ కి దిమ్మతిరిగింది. అయితే ఇది చూసిన కొంతమంది తెలుగు హీరోలు ప్రాపర్ స్టోరీ లేకపోయినా ప్యాన్ ఇండియా సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. బాలీవుడ్ కూడా ఇదే తప్పు చేస్తోంది. కేవలం తెలుగు సినిమాలతో పోటీపడటం కోసం అనవసరంగా ప్యాన్ ఇండియా సినిమాలు తీసి దెబ్బతింది. అలాంటి తప్పు మనం చేయకుంటే బెటర్.