Site icon NTV Telugu

Food Racism: ‘మీ ఆహారం కంపు కొడుతోంది..’ఇండియాపై వివక్ష విషం కక్కిన అహంకార అమెరికా.. చివరకు ఫ్యూజులౌట్!

Food Racism Indian Students

Food Racism Indian Students

ఒక చిన్న ఘటన.. పెద్ద తీర్పు. అమెరికా-కొలరాడో యూనివర్సిటీపై ఇద్దరు భారతీయ విద్యార్థులు న్యాయపరంగా గెలిచారు. క్యాంపస్‌లో భోజనాన్ని వేడి చేసుకున్నందుకు మొదలైన వివక్ష చివరకు కోటి 60లక్షల రూపాయల సెటిల్‌మెంట్‌తో ముగిసింది.

భారతీయ ఆహారాన్ని అవమానించడంతో మొదలైన ఈ ఎపిసోడ్‌ చివరకు న్యాయస్థానంలో పోరాడి గెలిచింది. ఈ కేసులో గెలుపు డబ్బు గురించి కాదు.. భారతీయతను చిన్నచూపు చూస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? పశ్చిమ దేశాల్లో భారతీయులు రోజూ ఎదుర్కొంటున్న ఫుడ్ రేసిజానికి ఒక ప్రూఫ్‌గా నిలుస్తోందా? ఈ గెలుపు వెనుక దాగి ఉన్న అసలు స్టోరీ ఏంటి?

2023 సెప్టెంబలో కొలరాడో యూనివర్సిటీ బోల్డర్ క్యాంపస్‌లో పీహెచ్‌డీ చదువుతున్న ఆదిత్య ప్రకాష్ తన భోజనాన్ని మైక్రోవేవ్‌లో వేడి చేసుకున్నాడు. అది పాలక్ పన్నీర్. భారతీయుల ఇళ్లలో సాధారణంగా వండే కూర. కానీ అక్కడే ఉన్న ఒక స్టాఫ్ సభ్యుడు ఆ ఆహారం కంపు కొడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్యాంపస్‌లో ఇలా కంపు కొట్టే ఆహారాన్ని వేడి చేయొద్దనే నిబంధన ఉందని చెప్పాడు. నిజానికి ఆ నిబంధన ఎక్కడా రాసి లేదు. ఆ ఘటన అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆదిత్య ప్రకాష్‌తో పాటు అతని ఫ్రెండ్‌ ఉర్మి భట్టాచార్యపై పరోక్ష ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇద్దరూ అదే యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. రీసెర్చ్ ఫండింగ్ ఆగిపోయింది. టీచింగ్ అసైన్‌మెంట్లు తీసేశారు. నెలలుగా పనిచేస్తున్న గైడ్లు మారిపోయారు. అకడమిక్ కెరీర్ ఒక్కసారిగా గాలిలో వేలాడుతున్నట్టు మారింది. దీంతో 2025లో ఇద్దరూ కోర్టు మెట్లు ఎక్కారు.

ఇది డబ్బుకోసం వేసిన కేసు కాదు. తమకు జరిగినది వ్యక్తిగత అపమానమో, సున్నితమైన అపార్థమో కాదని, ఒక సిస్టమేటిక్‌ వివక్ష అని కోర్టుకు చెప్పారు. ఫుడ్ మీద మొదలైన ఈ వివక్ష, చివరకు చదువు, జీవితం, గుర్తింపునే లక్ష్యంగా చేసుకున్నదని కోర్టుకు వివరించారు. ఈ కేసు సెప్టెంబర్ 2025లో సెటిల్‌మెంట్‌తో ముగిసింది.

ఇద్దరు విద్యార్థులకు డిగ్రీలు ఇవ్వడానికి యూనివర్సిటీ అంగీకరించింది. దాదాపు కోటి 60 లక్షల రూపాయల సెటిల్‌మెంట్ చెల్లించింది. కానీ అదే సమయంలో భవిష్యత్తులో ఆ యూనివర్సిటీలో చదవకూడదు, పనిచేయకూడదనే నిబంధన కూడా పెట్టింది. ఇటు ఈ కేసు ఇండియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇది ఒక్క క్యాంపస్ కథ కాదు. పశ్చిమ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు రోజూ ఎదుర్కొనే అనుభవాలకు ఇది ఒక ప్రతిబింబం. వాసన పేరుతో ఆహారాన్ని అవమానించడం, ఆహారంతో పాటు సంస్కృతిని కూడా చిన్నచూపు చూడటం విదేశీయులకు అలవాటుగా మారింది. భారతీయులతో పాటు ఆఫ్రికన్ ప్రజలు ఈ ఫుడ్ రేసిజాన్ని ఏదో ఒక రూపంలో ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఇక ఆదిత్య ప్రకాష్, ఉర్మి భట్టాచార్య ఇప్పుడు భారత్‌కు తిరిగొచ్చారు. మళ్లీ అమెరికాకు వెళ్లే ఆలోచన కూడా లేదంటున్నారు. ఎందుకంటే ప్రతిభ ఎంత ఉన్నా, స్కిన్ కలర్, వంట వాసన, జాతీయత ఆధారంగా ఎప్పుడైనా తమని బ్యాన్ చేసే అనిశ్చితి అక్కడ బలంగా ఉన్నట్టు అనిపించిందని చెబుతున్నారు. మరోవైపు ఒక ప్లేట్‌లో ఉన్న ఆహారం ఒక మనిషి గుర్తింపుగా మారితే, ఆ గుర్తింపును అవమానించడం ఎంత పెద్ద నేరమో ఈ కేసు గుర్తు చేస్తోంది.

ALSO READ: చీకటి గుహల్లో నేర సామ్రాజ్యం.. భారతీయులే టార్గెట్!

Exit mobile version