మన ఫోన్‌లోకి వచ్చే ఒక మెసేజ్.. ఒక జాబ్ ఆఫర్.. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్… ఇవి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ఆ ఒక్క క్లిక్ వెనుక ఒక చీకటి ప్రపంచం పనిచేస్తోంది. ఇది కేవలం ఆన్‌లైన్ మోసం కాదు. ఇది గోడలతో, గార్డులతో, ఆయుధాలతో నడిచే ఒక భూగర్భ సామ్రాజ్యం.
సౌత్ఈస్ట్ ఆసియాలో అడవులు, బోర్డర్ ప్రాంతాలు, ఓల్డ్ క్యాసినోల మధ్య పుట్టిన స్కామ్.. ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. వేల మందిని బంధీలుగా మార్చి, రోజూ కోట్ల రూపాయల మోసాలు చేయించే ఈ వ్యవస్థలో మనుషులే ఆయుధాలు. ఇక్కడ మోసం ఒక ఉద్యోగం. భయం ఒక పాలసీ. హింస ఒక మేనేజ్‌మెంట్ టూల్. ఈ చీకటి సామ్రాజ్యం మొదట చైనాను టార్గెట్ చేసింది. ఇప్పుడు దృష్టి భారత్‌పై పడింది. వందలాది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు. వేల మంది భారతీయులు ఇక్కడ టార్గెట్ అవుతున్నారు. ఇంతకీ ఈ స్కామ్ ఎలా పుట్టింది? ఎవరు వీటిని నడుపుతున్నారు? భారతీయులు ఎందుకు వీటి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు?
ఈ స్కామ్ సామ్రాజ్యం ఒక్కరోజులో పుట్టింది కాదు. దానికి ఒక భూభాగం ఉంది. ఒక రాజకీయ పరిస్థితి ఉంది. ఒక అండర్‌గ్రౌండ్ ఎకానమీ ఉంది. సౌత్ఈస్ట్ ఆసియాలోని మియన్మార్, కాంబోడియా, లావోస్, థాయ్‌లాండ్ బోర్డర్ ప్రాంతాలు ఈ నెట్‌వర్క్‌కు కేంద్రాలయ్యాయి. చట్టం బలహీనంగా ఉన్న ప్రాంతాలివి. ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా లేని జోన్లు కూడా ఇవే. మిలీషియాలు, సైనిక గ్రూపుల అండతో నడిచే భూభాగాలు కావడంతో ఇక్కడే స్కామ్ సిటీలు పుట్టాయి. మియన్మార్‌లోని మయవాడీ ప్రాంతంలో ఉన్న KK పార్క్ ఈ చీకటి వ్యవస్థకు అడ్డాగా మారింది. ఇది సాధారణ కాలనీ కాదు. ఇది ఒక ఫోర్టిఫైడ్ కాంపౌండ్. ఎత్తైన గోడలు, సెక్యూరిటీ గార్డులు, బయోమెట్రిక్ గేట్లు ఉంటాయి. లోపల వేల మంది బంధీలు ఉంటారు.. వారంతా బయటకు రావడం అసాధ్యం. ఈ కాంపౌండ్ నియంత్రణ సా చిట్ థు అనే అతని చేతుల్లో ఉంది. అతను మియన్మార్ మిలిటరీకి దగ్గరి వ్యక్తి. అమెరికా ప్రభుత్వం కూడా అతనిపై శాంక్షన్లు విధించింది.
నిజానికి ఇక్కడ పని చేసే వాళ్లు స్కామర్లు కాదు. వాళ్లు బంధీలు. మొదట జాబ్ యాడ్స్ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్, క్రిప్టో, ఐటీ సపోర్ట్ అంటూ ఆఫర్లు కనిపిస్తాయి ముఖ్యంగా భారత్, చైనా, నేపాల్, ఫిలిప్పీన్స్ యువతను టార్గెట్ చేస్తారు. ఫ్లైట్ టికెట్, వీసా, హోటల్ లాంటివి అరేంజ్ చేస్తారు.
అక్కడికి వెళ్లాక అసలు నిజం బయటపడుతుంది. పాస్‌పోర్ట్‌లు లాక్కుంటారు. అప్పులు సృష్టిస్తారు. రోజుకు 12 నుంచి 16 గంటలు పని చేయిస్తారు. టార్గెట్ రీచ్ కాకపోతే కొట్టడం, ఆకలి, మానసిక వేధింపులు. ఇది స్కామ్ కాదు. ఇది మానవ అక్రమ రవాణా. ఈ వ్యవస్థను గ్లోబల్ ఇనిషియేటివ్ అగైనెస్ట్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక కొత్త పదంతో వర్ణించింది. కాంపౌండ్ క్రైమ్స్‌గా పేరు పెట్టింది. అంటే ఒకే చోట మానవ అక్రమ రవాణా, సైబర్ మోసం, హింస, బ్లాక్‌మనీ లాంటివి కలిసిపోయిన నేరం అన్నమాట.
ఇక్కడ నడిచే స్కామ్‌లలో అత్యంత క్రూరమైనది పిగ్ బుచరింగ్. ముందు నమ్మకం పెంచుతారు. ఫ్రెండ్‌లా, ప్రేమికుల్లా మాట్లాడతారు. తర్వాత క్రిప్టో లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ల్లో డబ్బు పెట్టమంటారు. మొదట చిన్న లాభాలు చూపిస్తారు. తర్వాత పెద్ద మొత్తాలు లాగేస్తారు. చివరికి అకౌంట్ ఖాళీ.
బాధితుడు మానసికంగా కూడా విరిగిపోతాడు. ఒకప్పుడు ఇది చైనాకే పరిమితం. ఇప్పుడు 110 దేశాలకు విస్తరించింది. ఈ స్కామ్ ఎకానమీ ఎంత పెద్దదో చెప్పాలంటే కాంబోడియాలోని ఓ గ్రూప్ తన క్రిప్టో నెట్‌వర్క్ ద్వారా సుమారు 91 బిలియన్ డాలర్ల లావాదేవీలు నిర్వహించింది. భారతీయ రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. మరోవైపు ఈ స్కామ్‌లో ఎక్కువగా భారతీయులే చిక్కుకుంటున్నారు. 2022 నుంచి ఇప్పటివరకు 1,600 మందికి పైగా భారతీయులను ఈ స్కామ్ కాంపౌండ్‌ల నుంచి తిరిగి స్వదేశానికి వచ్చారు. 2025లో ఒక్క ఆపరేషన్‌లోనే భారత వైమానిక దళం 283 మందిని తీసుకొచ్చింది. కానీ ఇది ఐస్‌బర్గ్‌లో కనిపించే భాగం మాత్రమే. ఇంకా వేల మంది అక్కడే ఉన్నారనే అంచనా.
ఇదే సమయంలో భారత్‌లో స్కామ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఫేక్ కాల్స్, ఇతర ఫ్రాడ్స్, క్రిప్టో స్కామ్స్ పెరుగుతున్నాయ్. ఈ స్కామ్ సిటీల్లో బంధీలుగా ఉన్నవాళ్లే భారతీయులను మోసం చేస్తున్నారని సమాచారం. అందుకే ఇది కేవలం విదేశాంగ సమస్య కాదు.. ఇది దేశ భద్రత సమస్య.
ఇటు చైనా మాత్రం ఈ స్కామ్‌పై పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఈ స్కామ్ వ్యవస్థపై మొదటిసారి పెద్ద ఎత్తున ప్రశ్నలు రావడానికి ఒక సినిమా కారణమైంది. 2023లో విడుదలైన నో మోర్ బెట్స్ అనే సినిమా స్కామ్ సెంటర్లలో జరిగే మానవ అక్రమ రవాణా, హింస, ఆన్‌లైన్ మోసాల వాస్తవాలను తెరపైకి తీసుకొచ్చింది. అదే సమయంలో ఒక చైనా నటుడు స్కామ్ కాంపౌండ్‌కు వెళ్లిన ఘటన బయటకు రావడంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం చెలరేగింది. ఈ ఒత్తిడితో చైనా ప్రభుత్వం స్పందించింది.
ఆపరేషన్ 1027 పేరుతో మియన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న స్కామ్ హబ్‌లపై పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. మియన్మార్‌లోని సాయుధ గుంపులపై ఒత్తిడి పెంచి, స్కామ్ నెట్‌వర్క్‌లను కూల్చే ప్రయత్నం చేసింది. ఈ ఆపరేషన్ ఫలితంగా దాదాపు 41 వేల మంది అనుమానితులను అరెస్ట్ చేసి చైనాకు అప్పగించారు. కానీ ఈ విజయం ఎక్కువకాలం నిలబడలేదు. స్కామ్ మాఫియాలు పూర్తిగా నశించలేదు. అవి తమ కేంద్రాలను మియన్మార్ లోతైన ప్రాంతాల నుంచి థాయ్‌లాండ్ సరిహద్దు వైపు తరలించాయి. పాత కాంపౌండ్‌లను వదిలి, కొత్త ప్రాంతాల్లో అదే వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రాంతం మారింది కానీ విధానాలు మారలేదు.. మోసాలూ ఆగలేదు. కానీ ఈసారి బాధితుల జాబితాలో మార్పు వచ్చింది. చైనాపై ఒత్తిడి పెరగడంతో స్కామ్ నెట్‌వర్క్‌లు కొత్త లక్ష్యాల కోసం వెతకడం మొదలుపెట్టాయి. అక్కడే భారత్ ముందువరుసలోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో, ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ల పేరుతో, ఫ్రెండ్‌షిప్, లవ్ ట్రాప్‌ల పేరుతో భారతీయులను టార్గెట్ చేయడం వేగంగా పెరిగింది.
ఇలా అడవుల్లో పుట్టిన ఈ స్కామ్.. ఇప్పుడు మన ఫోన్ స్క్రీన్‌లలోకి వచ్చేశాయి. ఒక క్లిక్‌తో మొదలయ్యే మోసం వెనుక ఎంత పెద్ద యంత్రాంగం ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. మరి ఇంకా మనం దీన్ని కేవలం సైబర్ క్రైమ్‌గా మాత్రమే చూస్తామా? లేదా మానవ అక్రమ రవాణా, జాతీయ భద్రత సమస్యగా గుర్తించి ఎదుర్కొంటామా?
ALSO READ: ‘నాన్నా.. నన్ను కాపాడు…’ ఇది వ్యవస్థ చేసిన హ*త్య..? సంచలన రేపుతోన్న యువరాజ్ డెత్ ఎపిసోడ్!