Site icon NTV Telugu

Gen-Z : పచ్చి తాగుబోతులు భయ్యా… ఇవే తగ్గించుకుంటే మంచిది!

Gen Z Binge Drinking

Gen Z Binge Drinking

ఈ తరం మిగతా తరాల కంటే కాస్త భిన్నమట. జెన్‌-జీ గురించి ఎక్కువమంది చెప్పే డైలాగ్ ఇది. మద్యం తక్కువగా తాగుతారని.. రిస్క్ అలవాట్లకు దూరంగా ఉంటారని జెన్‌-జీపై అభిప్రాయాలున్నాయి. అందుకే చాలా మంది జెన్‌-జీను ‘జనరేషన్ సెన్సిబుల్’ అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని కొత్త పరిశోధనలు ఆ అభిప్రాయాన్ని ప్రశ్నిస్తున్నాయి. టీనేజ్ దశ నుంచి 20 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టే సమయంలో ఈ తరం ప్రవర్తనలో భారీ మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మద్యం సేవించడం మాత్రమే కాదు.. బింజ్ డ్రింకింగ్, డ్రగ్స్ వినియోగం, వెపింగ్, గ్యాంబ్లింగ్ లాంటి అలవాట్లు కూడా పెరుగుతున్నాయట. బ్రిటన్‌లో జరిగిన ఒక పెద్ద అధ్యయనం ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. వేలాది మంది యువతపై చేసిన పరిశోధనలో టీనేజ్ దశలో కనిపించిన అలవాట్లు 20ఏళ్ల వయస్సులోకి వచ్చేసరికి పూర్తిగా మారిపోయాయని తేలింది.

ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ లాంగిట్యూడినల్ స్టడీస్ నిర్వహించింది. 2000 నుంచి 2002 మధ్య జన్మించిన దాదాపు 10 వేల మంది యువతపై ఈ పరిశోధన జరిగింది. వీరంతా మిల్లీనియం కోహార్ట్ స్టడీ అనే దీర్ఘకాలిక పరిశోధనలో భాగంగా ఉన్నారు. అదే వ్యక్తుల అలవాట్లను 17 ఏళ్ల వయస్సులో ఎలా ఉన్నాయో, 23 ఏళ్లకు చేరుకునే సరికి ఎలా మారాయో పరిశోధకులు పోల్చి చూశారు.

ఆ పరిశోధనలో ముఖ్యంగా బయటపడిన విషయం బింజ్ డ్రింకింగ్. 23 ఏళ్ల వయస్సు కలిగిన యువతలో సుమారు 68 శాతం మంది గత ఏడాదిలో కనీసం ఒకసారి బింజ్ డ్రింకింగ్ చేశామని చెప్పారు. 17 ఏళ్ల వయస్సులో ఈ సంఖ్య 53 శాతంగా ఉండగా.. కొన్ని సంవత్సరాల్లోనే అది భారీగా పెరిగింది. మద్యం సేవించడమే కాదు.. డ్రగ్స్ వినియోగం కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్నట్టు అధ్యయనం చెబుతోంది. 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు దాదాపు 31 శాతం మంది మాత్రమే గంజాయి వినియోగించామని చెప్పగా.. 23 ఏళ్లకు చేరుకునే సరికి ఆ సంఖ్య 49 శాతానికి పెరిగింది.

ఇంకా కోకైన్, కెటమైన్ వంటి హార్డ్ డ్రగ్స్ కూడా ప్రయత్నించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. 17 ఏళ్ల వయస్సులో కేవలం 10 శాతం మంది మాత్రమే ఈ డ్రగ్స్‌ను ప్రయత్నించామని చెప్పగా.. 23 ఏళ్లకు చేరుకునే సరికి అది 32 శాతానికి పెరిగింది.

ఇక వెపింగ్ కూడా వేగంగా పెరుగుతున్న అలవాట్లలో ఒకటిగా కనిపిస్తోంది. 17 ఏళ్ల వయస్సులో రోజూ వెపింగ్ చేస్తున్నవారు కేవలం 3 శాతం మాత్రమే ఉండగా.. 23 ఏళ్లకు వచ్చే సరికి అది 19 శాతానికి పెరిగింది. మరొక ఆసక్తికర అంశం గ్యాంబ్లింగ్. 23 ఏళ్ల వయస్సులో దాదాపు 32 శాతం మంది యువత కనీసం ఒకసారి అయినా గ్యాంబ్లింగ్ చేశామని చెప్పారు. అయితే అందులో కేవలం 4 శాతం మాత్రమే తమకు గ్యాంబ్లింగ్ సమస్యగా మారిందని అంగీకరించారు. పరిశోధకుల ప్రకారం పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలతో పోలిస్తే యువకులు గ్యాంబ్లింగ్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది.

నిపుణుల ప్రకారం ఈ వయస్సు జీవితంలో ప్రయోగాల దశగా భావిస్తారు. కానీ మద్యం, డ్రగ్స్ వినియోగం ఈ దశలో ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా మెదడు అభివృద్ధి పూర్తిగా ముగిసేది మిడ్-20s లోనే. అందుకే ఈ వయస్సులో అధిక మద్యం సేవించడం మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కానీ జెన్‌-జీకి ఇవేవీ ఇప్పుడు పట్టకపోవడం అత్యంత బాధాకరమని డాక్టర్లు అంటున్నారు.

Exit mobile version