Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..

Hyderabad1

Hyderabad1

Hyderabad: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత లేని వంటశాలలు బయటపడుతున్నాయి. తాజాగా కొండాపూర్‌లోని ‘జాయకా ఫుడ్ కోర్ట్’ (Zayqa Food Court) లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఈ ఫుడ్ కోర్టులో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయంటూ ఓ కస్టమర్ వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రెస్టారెంట్‌లో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఆహార పదార్థాల ప్యాకెట్లను కొరికేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ స్టోర్ చేసే ప్రాంతాల్లో ఎలుకల విసర్జనలు పడి ఉండటాన్ని గమనించారు. వీటికి తోడు, అస్సలు పనిచేయని ఓ ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైపోయిన చికెన్ బిర్యానీని నిల్వ ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. కిచెన్ పరిసరాలన్నీ తీవ్ర అపరిశుభ్రంగా మారడమే కాకుండా, కనీస నిబంధనలైన ఉద్యోగుల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, రెస్టారెంట్ పెస్ట్ కంట్రోల్ రికార్డులు ఏవీ యాజమాన్యం వద్ద అందుబాటులో లేవు. ఈ స్థాయిలో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు గానూ ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయకా ఫుడ్ కోర్ట్ ఫుడ్ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. అనంతరం ఆ ఫుడ్ కోర్టును పూర్తిగా సీజ్ చేశారు. నగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ప్రముఖ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడుతుండటంతో నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో నాణ్యత కొరత..

ఇక, నగరవాసులకు బిర్యానీ అంటే కేవలం ఆహారం కాదు, అదొక ఎమోషన్. కానీ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, పేరున్న రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరుపుతున్న తనిఖీలు చూస్తుంటే.. మనం తినేది ఆహారమా లేక రోగాలా? అనే భయం పట్టుకుంటోంది. తిండి ప్రియులకు ఈ నిజాలు నిజంగానే విస్తుగొలుపుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారులు నగరంలోని ఐటీ కారిడార్ నుంచి పాతబస్తీ వరకు జరిపిన మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. చికెన్, మటన్ ముక్కలు కుళ్ళిపోయి, బూజు పట్టినా సరే.. వాటికి రంగులు, మసాలాలు దట్టించి కస్టమర్ల ప్లేట్లలోకి నెట్టేస్తున్నారు. చికెన్ 65, కబాబ్స్ వంటి వంటకాలు చూడగానే నోరూరుంచేలా చేయడానికి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదకరమైన సింథటిక్ రంగులను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇక కిచెన్‌లలో ఈగలు, బొద్దింకలు, ఎలుకలు సై్చరవిహారం చేస్తున్నాయి. డ్రైనేజీ పైపుల పక్కనే వంటకాలను సిద్ధం చేయడం, కనీసం చేతులకు గ్లౌజ్స్ లేకుండా వండడం, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ మరిగిస్తూ వాడడం సర్వసాధారణమైపోయింది.