600 Peoples Dies in Zambia Due to Cholera: ఆఫ్రికా దేశం అయిన జాంబియా.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జాంబియాను ప్రస్తుతం కలరా వ్యాధి పట్టిపీడిస్తోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారినపడగా.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అక్టోబర్ 2023 నుంచి దాదాపు 600 మంది కలరా వ్యాధితో మరణించారు. 15,000 మందికి పైగా కలరాతో బాధపడుతున్నారు. దేశంలోని మొత్తం పది ప్రావిన్స్‌ల్లో తొమ్మిదింటిలో ఈ వ్యాధి ప్రబలింది.
సాధారణంగా కలరాతో మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ జాంబియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మరణాల రేటు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉండటం జాంబియా దేశ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొన్న కలరా వ్యాప్తిని అరికట్టడానికి జాంబియా శ్రమిస్తోంది. ఎక్కువ కేసులు ఉన్న లుసాకాలో నేషనల్ హీరోస్ స్టేడియం వెలుపల తాత్కాలిక చికిత్సా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అధికారులు ప్రభావిత ప్రాంతాలకు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా చేపట్టారు.
Also Read: California Rainstorm: కాలిఫోర్నియాలో రికార్డు వర్షపాతం.. ముగ్గురు మృతి!
జాంబియాలో పరిస్థితులు దిగజారడంతో.. విశ్రాంత వైద్య సిబ్బంది సేవలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతుంటే.. మరోవైయిపు భారీ వర్షాలు వైద్య సేవలు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో జాంబియాకు భారత్ సాయం అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని పంపించింది.