NTV Telugu Site icon

Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిటిషన్

Supreme Court

Supreme Court

Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. కోట్లాదిమంది ప్రపంచ వ్యాప్త శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టిందని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అన్నారు. ఇది ఒక పార్టీ, ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదని, కోట్లాదిమంది భక్తుల విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారన్నారు. తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నామని, కానీ ఈ అంశం ప్రపంచవ్యాప్త భక్తులకు సంబంధించినది కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ ప్రచారంలో నిజం ఉంటే అది బయటికి రావాలన్నారు. లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటికి రావాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అన్నారు.

Read Also: Minister Anam Ramanarayana Reddy: ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..

విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలన్నారు. దోషులను రక్షించాలని మేము చెప్పడం లేదని.. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. ఏఆర్ ఫుడ్ టాంకర్లు సరఫరా చేసిన 10 టాంకర్లలో 14 రకాల పరీక్షలు చేయగా 4 టాంకర్లలో కల్తీ జరిగిందని టీటీడీ ప్రస్తుత ఈవో శ్యామల రావు తెలిపారని.. కల్తీ జరిగిందని గుర్తించిన 4 టాంకర్లను వెనక్కు పంపించినట్టు ఆయనే చెప్పారన్నారు. ప్రతి ట్యాంకర్‌ నుంచి ముగ్గురు మూడు వేరువేరు శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని.. ఆ మూడు రిపోర్టులలో కల్తీ లేదని నిర్ధారణ జరిగితేనే ట్యాంకర్‌ను లోపలకు అనుమతిస్తారని న్యాయవాది చెప్పారు. తమ దగ్గర కల్తీని నిర్ధారించే టెస్టింగ్ ల్యాబ్ లేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. శర్మిష్ట అనే అధికారి టీటీడీకి వచ్చే నెయ్యిని ఎలా పరీక్షిస్తారో వివరించారన్నారు. 2014-19 మధ్యకాలంలో అక్కడ పనిచేసిన అధికారి పరీక్షల విధానాన్ని స్వయంగా చెబుతుంటే ఇలా ఎలా అబద్ధాలు చెబుతున్నారని ప్రశ్నించారు. ఇది ధర్మమా అని అడుగుతున్నామన్నారు.

నాసిరకం నెయ్యి సరఫరా చేసిన వారిని రక్షించడం కోసం తాము ఇక్కడికి రాలేదన్నారు. మొట్టమొదటిసారిగా మే 15న ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను సరఫరా చేసిందన్నారు. ఆ సమయానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందన్నారు. అధికారులు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారని న్యాయవాది తెలిపారు. నెయ్యి నాసిరకం అని తేలితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపటికి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. లడ్డు తయారీకి వినియోగించే అవకాశం అసలే లేదని చెప్పారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి వీళ్లు ఏం సాధించాలి అనుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడిని సైతం ఉపయోగించుకుని బురద జల్లుతున్నారన్నారు. ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా చేసిన సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదన్నారు. వైవీ సుబ్బారెడ్డి హయాంలో ఏఆర్ ఫుడ్స్ ఎలాంటి టెండర్ దక్కించుకోలేదన్నారు. కరుణాకర్ రెడ్డి హయాంలో ఒక్క ట్యాంకర్ కూడా సరఫరా జరగలేదన్నారు. ఈవో మొదట మాట్లాడినప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ ద్వారా కల్తీ జరిగి ఉండొచ్చు అన్నారని చెప్పుకొచ్చారు. S-వాల్యూ ద్వారా కల్తీ జరిగిందని గుర్తించాక, పూర్తి వివరాల కోసం శాంపిళ్లను గుజరాత్‌కు పంపించారన్నారు.

Read Also: Speaker Ayyanna Patrudu: విశాఖ డెయిరీపై స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు

ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో తక్కువగా చూపిస్తుందో.. కారణాలను గుజరాత్ ల్యాబ్ వివరించిందన్నారు. ఆవుకు సరైన పోషణ లేకపోయినా.. ఆ నెయ్యిలో ఎస్ వాల్యూ తక్కువగా ఉంటుందని చెప్పారని న్యాయవాది తెలిపారు. వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో చెప్పిన నాలుగు రోజుల తర్వాత సీఎం యానిమల్ ఫ్యాట్ ఉందని అన్నారన్నారు. నిజానికి తిరస్కరించిన ట్యాంకర్ లోపలికే రానప్పుడు, లడ్డూలో వినియోగించారని సీఎం ఎలా చెబుతారని ప్రశ్నించారు. కల్తీలో పంది కొవ్వు కలిసింది అని చెప్పారు.. పందికొవ్వు మార్కెట్ ధర కేజీకి రూ. 450 నుంచి రూ. 1,400/- వరకు ఉందని.. రూ. 320 కి సరఫరా చేసే నెయ్యిలో అంతకంటే ఖరీదైన వస్తువుతో కల్తీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎవరైనా ఖరీదైన వాటితో కల్తీ చేస్తారా అని ప్రశ్నలు గుప్పించారు. రాగి చెంబుకు బంగారంతో కల్తీ చేస్తారా? బంగారంలో ఇత్తడి కలుపుతారు.. కానీ ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అంటూ ప్రశ్నించారు. ఇంతకన్నా అవివేక ఆరోపణ, బురద జల్లుడు ఇంకెక్కడైనా ఉంటుందా అని వ్యాఖ్యానించారు. S వాల్యూ తగ్గింది అంటే కల్తీ జరిగింది అని అర్థం. దాని అర్థం పశువుల కొవ్వు కలిసింది అని కాదన్నారు. ‘ఎస్’ వాల్యూ తగ్గడానికి గల కారణాలను కూడా ల్యాబ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారన్నారు.

టెండర్లలో పాల్గొన్న 5-6 సంస్థలు ఇంచుమించు ఓకే ధర పేర్కొన్నాయి. వాటిలో ఏఆర్ ఫుడ్స్ రివర్స్ టెండర్లో అన్నికంటే తక్కువ ధర కోట్ చేసిందన్నారు. ఆ సమయంలో అధికారుల పాలన ఉందని.. అయినా ప్రభుత్వానికి, టీటీడీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎస్ వాల్యూ తక్కువ ఉంది అంటే కల్తీ జరిగింది అని అర్థమని.. అంతే తప్ప అందులో పశువుల కొవ్వు కలిసింది అని అర్థం కాదన్నారు. తన పాటకు పల్లవి కలిపేలా సిట్ ఏర్పాటు చేశారని.. అందుకే మేము సిట్టింగ్ జడ్జి లేదా విశ్రాంతి న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కోరుతున్నామన్నారు. వైవీ సుబ్బారెడ్డి గారు పరమ భక్తులు. 40 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారని.. కోట్లాదిమంది భక్తులకు నిజం తెలియాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.