YV Subba Reddy: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాదాపు మూడేళ్ల క్రితం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. అయితే, ఇంత కాలం పెండింగ్‌లో ఉంచి ఎలాంటి నిర్ణయం తీసుకోని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం.. రెండు రోజుల క్రితం ఆ రాజీనామాకు ఆమోద ముద్ర వేయడం చర్చగా మారింది.. అసలు, రాజీనామాపై నా అభిప్రాయం తీసుకోకుండా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తున్నారు గంటా శ్రీనివాసరావు.. అయితే, గంటా రాజీనామా ఆమోదంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజీనామా చేసే ముందే గంటా ఆలోచించుకోవాల్సిందన్న ఆయన.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి ఇప్పుడు గగ్గోలు పెడితే ఎలా? అని ప్రశ్నించారు. ఇక, రాజీనామా ఎప్పుడు ఆమోదించాలన్నది స్పీకర్ పరిధిలోని అంశం అని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Andhra Pradesh: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం.. అన్ని శాఖలకు కీలక ఆదేశాలు
మరోవైపు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మరోసారి మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి.. షర్మిలకు అభివృద్ది చూపడానికి మేం సిద్ధమే అని ప్రకటించారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన షర్మిలకు ఉద్దానంలో మేం కట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీరు ప్రాజెక్ట్ కనపడలేదా? అని ప్రశ్నించారు. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా.. వైఎస్ షర్మిలకు అభివృద్ది కనపడుతుందని తెలిపారు. ఇక, రాజధాని కట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి..? చంద్రబాబును ప్రశ్నించాల్సిన అంశాలను మమ్మలను ప్రశ్నిస్తే ఎలా? అని వైఎస్ షర్మిలను నిలదీశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.