NTV Telugu Site icon

YSRCP Samajika Sadhikara Bus Yatra: రేపటితో ముగియనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

Ysrcp Samajika Sadhikara Bu

Ysrcp Samajika Sadhikara Bu

YSRCP Samajika Sadhikara Bus Yatra: ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన మొదటి దశ బస్సు యాత్ర… శుక్రవారంతో ముగియనుంది. ఫస్ట్ ఫేజ్ లో 39 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్దేశించుకున్నా… పలు కారణాలతో 35 నియోజకవర్గాల్లో పూర్తి అవుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఏకకాలంలో ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు బస్సు యాత్రలు, మూడు సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగ‌న‌మ‌ల‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అయింది. ఈ బస్సు యాత్ర పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండా.

ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో… మూడు నియోజకవర్గాల్లో బస్సు యాత్రను విజయవంతంగా చేపట్టడానికి పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు వంటి నేతలకు బాధ్యతలను అప్పగించింది వైసీపీ హైకమాండ్‌. అయితే వీరంతా తెర వెనుక కార్యక్రమ ఏర్పాట్లు చూడటమే మినహా తెర మీద ప్రచార కార్యక్రమాల్లో వీరి పాత్ర ఉండకపోవటం విశేషం. జగన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా క్యాబినెట్‌లో దాదాపు 70 శాతం మంత్రి పదవులు ఈ నాలుగు సామాజిక వర్గాలకే కేటాయించారు. అంతేకాదు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఈ సామాజిక వర్గాలకే జగన్ పెద్ద పీట వేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ వీరిది సింహ భాగం. ఈ అంశాలనే పార్టీ ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసింది. అంటే, ఒకవైపు సంక్షేమ ఫలాలు అందించటం మాత్రమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దఎత్తున రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని వెల్లడించారు.

అయితే వైసీపీ చేపట్టిన ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర కేవలం బస్సు యాత్రకే పరిమితం కాకుండా స్థానికంగా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరింత చొరవతో సృజనాత్మకతతో స్థానిక కళలు, సంప్రదాయ ప్రదర్శనలతో కొత్త దనాన్ని జోడించటం కనిపించింది. పాడేరులో గిరి పుత్రుల థింసా నృత్యం, అదే విధంగా కోలాటాలు, పులి వేషాలు, బైక్, ట్రాక్టర్ ర్యాలీలు, పాదయాత్రలు వంటివి జోడించటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. దీంతో పాటు కొన్ని చోట్ల స్థానికంగా ప్రభావ శీల బృందాలతోనూ సమావేశాలు నిర్వహించారు. కొన్ని చోట్ల స్కూళ్లల్లో ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమాల సందర్శన వంటివి కూడా జోడించారు. అంతే కాదు గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సామాజిక బస్సు యాత్రను వైసీపీ నాయకులు ఒక వేదికగా ఉపయోగించుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చంద్రబాబు మోసం చేశారని ఎండగట్టారు. ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తా వంటి చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఆయుధాలు మలుచుకున్నారు.

సామాజిక సాధికార యాత్రలో వైసీపీ మంత్రులు, నేతలు… ముఖ్యంగా గతంలో చంద్రబాబు హయాంలో, ఇప్పుడు జగన్‌ పాలనలో తేడాలను ప్రజలకు వివరించడంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. టీడీపీ పాలనలో అబద్ధపు హామీలు ఇచ్చి నట్టేట ముంచారని విమర్శించారు. ఇప్పుడు పేదల గుండె తడి తెలిసిన సీఎం జగన్‌… రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారని ప్రజలకు వివరించారు. గతంలో సామాజిక సాధికార అంశం ఓటు బ్యాంకుగానే ఉండిందనీ, ఇప్పుడు ప్రతి పేదవాడికి మేలు జరిగిందా లేదా? అనేది ప్రజలు ఆలోచించాలనీ సూచించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు దక్కిన సామాజిక న్యాయం గురించి వివరించే క్రమంలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అడుగడుగునా నీరాజనాలు పలికారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు ఈ యాత్ర ద్వారా మరింత దగ్గరయ్యామని అంటున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు అంటే ఈనెల 30వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుంది. సెకెండ్ ఫేస్‌లో 40 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తి చేయనున్నారు. 60 రోజుల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లను సామాజిక సాధికార బస్సు యాత్ర పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మొత్తం మీద మొదటి దశ సామాజిక సాధికార యాత్ర కొనసాగిన తీరు పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.