NTV Telugu Site icon

YSRCP Samajika Sadhikara Bus Yatra: నేటితో ముగియనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. చివరి రోజు ఇలా..

Ycp

Ycp

YSRCP Samajika Sadhikara Bus Yatra: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన మొదటి దశ బస్సు యాత్ర… ఇవాళ్టితో ముగియనుంది. ఫస్ట్ ఫేజ్ లో 39 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్దేశించుకున్నా… పలు కారణాలతో 35 నియోజకవర్గాల్లో పూర్తి అవుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఏకకాలంలో ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు బస్సు యాత్రలు, మూడు సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగ‌న‌మ‌ల‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అయింది. ఈ బస్సు యాత్ర పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండా.

ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో… మూడు నియోజకవర్గాల్లో బస్సు యాత్రను విజయవంతంగా చేపట్టడానికి పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు వంటి నేతలకు బాధ్యతలను అప్పగించింది వైసీపీ హైకమాండ్‌. అయితే వీరంతా తెర వెనుక కార్యక్రమ ఏర్పాట్లు చూడటమే మినహా తెర మీద ప్రచార కార్యక్రమాల్లో వీరి పాత్ర ఉండకపోవటం విశేషం. జగన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా క్యాబినెట్‌లో దాదాపు 70 శాతం మంత్రి పదవులు ఈ నాలుగు సామాజిక వర్గాలకే కేటాయించారు. అంతేకాదు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుల నుంచి నామినేటెడ్ పదవుల వరకు ఈ సామాజిక వర్గాలకే జగన్ పెద్ద పీట వేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ వీరిది సింహ భాగం. ఈ అంశాలనే పార్టీ ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసింది. అంటే, ఒకవైపు సంక్షేమ ఫలాలు అందించటం మాత్రమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దఎత్తున రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారని వెల్లడించారు.

ఇక, చివరి రోజు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక బస్సు యాత్ర చివరి రోజు కూడా మూడు ప్రాంతాల్లో కొనసాగనుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఈ రోజు బస్సు యాత్ర కొనసాగనుంది.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జయరాం, ఉషాశ్రీ చరణ్‌, మెరుగు నాగార్జున, ఎంపీ మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకారెడ్డి, రామసుబ్బారెడ్డి, హఫీజ్‌ఖాన్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీ నందిగాం సురేష్‌, కుంభ రవిబాబు తదితరలు పాల్గొనన్నారు.. మరోవైపు పల్నాడు జిల్లా పెదకూరపాడులో సామాజిక సాధికార యాత్ర సాగనుంది.. ఇక్కడ మంత్రులు విడదల రజినీ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, అలీ తదితరులు పాల్గొననున్నారు. ఇక, మన్యం జిల్లా పార్వతీపురంలో జరగనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యాలనాయుడు, రాజన్నదొర తదితరలు పాల్గొననున్నారు. మరోవైపు.. ఈనెల 15వ తేదీ నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు అంటే ఈనెల 30వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుంది. సెకెండ్ ఫేస్‌లో 40 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తి చేయనున్నారు. 60 రోజుల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లను సామాజిక సాధికార బస్సు యాత్ర పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మొత్తం మీద మొదటి దశ సామాజిక సాధికార యాత్ర కొనసాగిన తీరు పట్ల పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.