NTV Telugu Site icon

MP Vijayasai Reddy: విభజన హామీలను నెరవేర్చాలి.. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

Vijayasai Reddy On Babu

Vijayasai Reddy On Babu

MP Vijayasai Reddy: విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలి.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. పోలవరం ప్రాజెక్టు బకాయిలన్నీ చెల్లించాలి.. ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. రైల్వేజోన్‌ ఏర్పాటుపై మాటనిలబెట్టుకోవాలంటూ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. గురువారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న నేపథ్యంలో.. ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను లేవనెత్తిన అంశాలను వివరించారు సాయిరెడ్డి..

బీసీలకు సంబంధించి వైసీపీ మొదట్నుంచీ చాలా స్పష్టమైన విధివిధానాలతో ఉంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఏ రకంగానైతే చట్టసభల్లో రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారో.. అంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్‌ను అమలులో ఉంది. అదే మాదిరిగా దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ప్రస్తుతం 27 శాతానికి పరిమితమైంది. జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని వైసీపీ తరఫున సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.. ఇక, పార్టీ ఫిరాయింపుల చట్టం విషయానికొస్తే రాజ్యాంగం 10వ షెడ్యూల్‌లో దీనిని పొందుపరిచినప్పటికీ అది పూర్తిగా నిర్వీర్యం అయింది. అటు కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇటు బీజేపీ ప్రభుత్వం రెండూ కూడా ఆ చట్టం అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకొచ్చాం. రాష్ట్రాల్లో, లోక్‌సభలో ప్రిసైడింగ్‌ అధికారులుగా ఉన్న స్పీకర్లు పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించారు.

మరోవైపు.. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని కూడా మేం చర్చలో పెట్టామన్నారు సాయిరెడ్డి.. ప్రత్యేక హోదా అనేది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తామన్నారు. మరి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వెళ్లిపోయి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా ఈరోజు వరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అవసరమని… అది ఆంధ్రుల హక్కుగా దీన్ని మేం అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆ హోదాను కల్పించమని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరులో సానుకూలంగానే వ్యవహరిస్తోంది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్‌–1లో రూ.12911 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన నిధులు రూ.4,233 కోట్లు కూడా త్వరలోనే విడుదల చేయాలని కేంద్రానికి మేం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.1310 కోట్లు ఖర్చుపెట్టగా, ఆ బకాయిల మొత్తాన్ని కూడా త్వరలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు విజయసాయి రెడ్డి.

సౌత్‌ కోస్టల్‌ రైల్వేజోన్‌ విషయంలో.. ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్‌ 13, 8వ పాయింట్‌లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి నాలుగేళ్ళు అయింది. రైల్వే జోన్‌ ఏర్పాటుపై డీపీఆర్‌ సమర్పించి మూడేళ్లైంది కానీ, సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు.. దీనిపై కాలయాపన తగదని అఖిలపక్ష సమావేశంలో చెప్పి రైల్వే జోన్‌ ప్రారంభాన్ని త్వరితగతిన చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి.. ఇక, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ అభిప్రాయాన్ని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి స్పష్టంచేశాం. ఈరోజు అఖిలపక్ష సమావేశం వేదికగా మరోమారు దీనిని ప్రస్తావించాం. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలనే కేంద్ర నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎట్టిపరిస్థితులలోను ఆమోదయోగ్యం కాదని.. కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని అఖిలపక్షంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. నష్టాల్లోఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించాలనేది బీజేపీ ప్రభుత్వ విధానం. అయితే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల్లో ఉన్న సంస్థ. లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయాలనే బీజేపీ ప్రభుత్వ నిర్ణయం చాలా తప్పు అనే విషయాన్ని మేం పదేపదే చెప్పాం. ఈరోజు అఖిలపక్షం సమావేశం ద్వారా కేంద్రానికి మరోమారు అదే విషయం స్పష్టం చేశామని.. ఈ అంశాలన్నింటినీ ఈ పార్లమెంట్‌ సమావేశాలలో లేవనెత్తి ఏపీ ప్రజల తరఫున వైసీపీ ఎంపీలంతా పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు విజయసాయి రెడ్డి.