Margani Bharat: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీసే వ్యక్తి అంటూ చంద్రబాబుపై భరత్ మండిపడ్డారు. రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టీడీపీ నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని ఎంపీ భరత్ వీడియోను చూపించారు. రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో మహానాడు కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. వెన్నుపోట్లు పొడవడం ఎందుకు?.. శత జయంతి ఉత్సవాలు చేయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న నాయకుడు చంద్రబాబు కాదా అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు 29 మంది ప్రాణాలు తీశారు. కనీసం మృతుల కుటుంబాలను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఏ మొహం పెట్టుకుని రాజమండ్రిలో మహానాడు పెట్టారు. రాజమండ్రిని నాశనం చేశారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారు. దండి మార్చ్ విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు. ఎంతకు తెగిస్తే ఇవన్నీ చేస్తారు అంటూ భరత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Minister Srinivas Goud: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..
విశాలమైన గ్రౌండ్‌లో పబ్లిసిటీ కోసం హడావిడి చేయకండి.. పుష్కరాల్లో ఘటన జరిగితే దానికి టీడీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం విగ్రహం కోటిపల్లి బస్టాండ్‌లో ఠీవీగా కనపడేదని… ఆయన విగ్రహం తొలగించి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టారన్నారు. దీనిని బట్టి టీడీపీ నేతల మనస్తత్వాన్ని గమనించొచ్చన్నారు. గత పుష్కరాల్లో కూడా పుష్కరఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో పెట్టి దేవుణ్ని అవమానించారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నా, పార్టీని, అధికారాన్ని ఎన్టీఆర్ వద్ద నుంచి లాక్కుని ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహించటం దారుణమని.. ఆయన ఆత్మ క్షోభిస్తూనే ఉంటుందన్నారు. మహానాడు సవ్యంగా నిర్వహించుకోండి… అవసరమైతే తాగునీళ్ల ట్యాంకులు కూడా తాము పంపిస్తామని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు.