AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!

Ap High Court Ycp

Ap High Court Ycp

YCP Files 2 Petitions Over Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ తన పిటిషన్‌లో కోరింది.

రాష్ట్ర పోలీసుల జోక్యం లేకుండా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ విజ్ఞప్తి చేసింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు 24 గంటల వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కూడా వైసీపీ హైకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ పిటిషన్‌లో పేర్కొంది.

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులకు అవసరమైన పత్రాల జారీ విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయని వైసీపీ మరో పిటిషన్‌లో పేర్కొంది. కమ్యూనిటీ సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌వోసీలు), నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీకి ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అవసరమైన ధ్రువపత్రాలను సకాలంలో జారీ చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల భద్రత, ఎన్నికల పర్యవేక్షణతో పాటు నామినేషన్లకు అవసరమైన ధ్రువపత్రాల జారీ వంటి అంశాలు వైసీపీ పిటిషన్లలో ప్రధానంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.