Site icon NTV Telugu

YSRCP: రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి విప్ జారీ చేసిన వైసీపీ

Ysrcp

Ysrcp

రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి వైసీపీ విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలో విప్ జారీ చేసింది.. విప్ ధిక్కరిస్తే ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయనుంది. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్ ల కోసం ఎన్నికలు
జరుగుతాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ ఛైర్ పర్సన్స్ ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేసింది.

READ MORE: Peddireddy Ramachandra Reddy: పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయ్..

ఇదిలా ఉండగా.. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. “వైసీపీ టికెట్ పై గెలిచిన కొందరు కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. ఈసారి కరీముల్లాను అభ్యర్థిగా నిలబెడుతున్నాం. గతంలోనే మైనార్టీ కి చెందిన ఖలీల్ అహ్మద్ కు అవకాశం కల్పించాం. ఆయనను శాసనసభ కు పంపించాలని జగన్ భావించి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన పరాజయం పాలయ్యారు. గత ఎన్నికలలో టీడీపీ తరఫున ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు. టీడీపీ తరఫున ఒకరు కూడా లేరు.
అందుకే మా కార్పొరేటర్ల ను కొనుగోలు చేసి అభ్యర్థిని ప్రకటించారు. ఇది ధర్మానికి.. అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లడం ద్రోహం చేయడమే. ముస్లిం మైనార్టీలకు నెల్లూరులో జగన్ ఎంతో ప్రాధాన్యం తీస్తున్నారు. 2014లో అబ్దుల్ అజీజ్ కు మేయర్ గా అవకాశం కల్పించారు. ఆయన పార్టీ ఫిరాయించారు. గత నగరపాలక సంస్థ ఎన్నికలలో డిప్యూటీ మేయర్ పదవిని మైనార్టీలకు ఇచ్చారు. పనుల కోసమే పార్టీ మారామని కొందరు కార్పొరేటర్లు చెబుతున్నారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మా పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.” అని స్పష్టం చేశారు.

READ MORE: YSRCP: ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన వైసీపీ.. ఎందుకంటే?

Exit mobile version