YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

YSRCP Protest: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇవాళ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. రైతాంగం, వాహనదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు, కూటమి నేతలు కలిసి ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఎక్కడ సమస్య వచ్చినా దానిని అవకాశంగా మార్చుకుని లాభాలు పొందడం చంద్రబాబుకు అలవాటైందని జగన్ విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, యూరియా, వంటగ్యాస్ తర్వాత ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా అదే జాబితాలో చేరాయని అన్నారు.

Read Also: Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి కొరత లేదని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని జగన్ పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం డీలర్లు, కూటమి నేతలు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించారని ఆరోపించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ధరలు పెరిగే అవకాశముందని భావించి డీలర్లు నిల్వలు దాచిపెడుతున్నారని, వారికి కూటమి నాయకులు సహకరిస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగి సమస్య మరింత తీవ్రతరమైందన్నారు.

ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ తెలిపారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు డీజిల్ అందక పనులు నిలిచిపోతున్నాయని, రబీ పంటల కోత కాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు. కోత యంత్రాలకు రోజుకు 100 నుంచి 160 లీటర్ల వరకు డీజిల్ అవసరమవుతుందని, సరఫరా లేక యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని చెప్పారు. ఆక్వా రంగం కూడా ఈ సంక్షోభంతో నష్టపోతుందని జగన్ పేర్కొన్నారు. చేపలు, రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరియేటర్లు డీజిల్‌పై ఆధారపడటంతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ జగన్ హెచ్చరించారు.