Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం తుపాకీని పోలీసులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. నంద్యాల ఘటన జరిగి 4–5 రోజులు గడిచినా ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని, అతనిపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యమేంటని నిలదీశారు. కొంతమందిని అరెస్ట్ చేసి ప్రధాన నిందితుడిని ఎందుకు వదిలేశారంటూ ఆక్షేపించారు. ప్రైవేట్ లైసెన్స్ తుపాకీని సరెండర్ చేయించకపోవడంపై ఈస్ట్ సీఐ శ్రీనివాసులుపై భూమన విమర్శలు గుప్పించారు.

నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంతోనే నిందితుడిని రక్షిస్తున్నారా? అని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. తుపాకీతో కాల్పులు జరిపిన వీడియోను దేశమంతా చూసిందని, ఇది ఎంతమాత్రం ఆత్మరక్షణ ప్రయత్నం కాదని భూమన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన తుపాకీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.