Kadapa Crime: కడపలో బుర్ఖాలు ధరించి బైక్‌పై వచ్చిన ఆ ఇద్దరు ఎవరు? సంధ్యా సర్కిల్‌లో జిమ్ నుంచి బయటకు వస్తున్న శ్రీనివాసులురెడ్డిపై వేట కొడవళ్లు, బాకులతో దాడి చేసి చంపేసింది ఎవరు? అసలీ హత్యకు కారణమేంటి? అంటే.. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, వాటా పంపకాల్లో తేడాలేనని వినిపిస్తోంది. శ్రీనివాసులురెడ్డిని అతని స్నేహితుడు ప్రతాపరెడ్డి చంపేశాడనే స్థానికంగా చర్చించుకుంటున్నారు. కడపలో కమలాపురం నేతల భూదందాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరుకు చెందిన APSRTC చైర్మన్ దుర్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి అనుచరులు కడపలో భూ దందాలు, సెటిల్మెంట్లతో ప్రత్యర్థులను బెదిరిస్తున్నారనే విమర్శలున్నాయి. మల్లికార్జున్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చిన్న నాగిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు రెడ్డి.. కొండూరుకు చెందిన ప్రతాపరెడ్డితో కలిసి కడప పరిసరాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాడు.
నాలుగు నెలల క్రితం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రహరీ గోడను కూల్చి వేసిన ఘటనలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఆ సెటిల్మెంట్‌లో వచ్చిన కోట్ల రూపాయల్లో తనకు వాటా ఇవ్వలేదని శ్రీనివాసులు రెడ్డితో ప్రతాపరెడ్డి గొడవ పడుతున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు రెడ్డిపై కక్ష పెంచుకున్న ప్రతాప రెడ్డి రెక్కీ నిర్వహించి మరీ హత్య చేసినట్లు అనుమానాలున్నాయి. నలుగురైదుగిరిపై అనుమానాలు ఉన్నాయని.. నిందితులను పోలీసులు పట్టుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కడపలోని ఎర్రముక్కపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్న ప్రతాపరెడ్డి..శ్రీనివాసులురెడ్డి హత్యకు ముందుగానే ఇళ్లు ఖాళీ చేశాడు. దీంతో అతనే ఈ హత్యకు పాల్పడినట్లు వాదన వినిపిస్తోంది. బురఖాలతో వచ్చి హత్య చేసిన నిందితులను గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.