Site icon NTV Telugu

YS Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు

Vs Viveka

Vs Viveka

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని సీబీఐ కోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివేకా కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో చేసిన వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ, కొన్ని షరతులతో ఆమె అభ్యర్థనకు అనుమతి తెలిపింది. వివేకా హత్య కేసులో కోర్టు ఆదేశిస్తే అదనపు దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత అభ్యర్థనకు మద్దతుగా, ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసినదే.

ఈ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని, అనేక అంశాల్లో దర్యాప్తు అసంపూర్తిగా ఉందని నిందితులు చెబుతున్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సునీత కోర్టుకు విన్నవించారు. వివేకా హత్యపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే మరోసారి లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై డిసెంబర్ 6వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. అనంతరం తీర్పును ఈ నెల 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, న్యాయవాది ఎస్. గౌతం కోర్టులో తమ వాదనలు వినిపించారు. అన్ని వాదనలు పరిశీలించిన అనంతరం, సునీత పిటిషన్‌ను సమర్థించిన కోర్టు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు కొనసాగించాలని సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Actor Nandu – singer Geetha: తన ప్రపోజల్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ సింగర్..

Exit mobile version