NTV Telugu Site icon

YS Jagan on EVMs: ఈవీఎంలపై వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. బ్యాలెట్ విధానమే ముద్దు..!

Jagan

Jagan

YS Jagan on EVMs: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈవీఎంలపై రకరకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈవీఎంల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈవీఎంల విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం.. ”న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్‌ బ్యాలెట్లను ఉపయోగించాలి.. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌..

Read Also: Priyanka Gandhi : వయనాడ్ నుంచి ప్రియాంక రెడీ.. పోటీపై సీపీఐ నేత అన్నీ రాజా ఏమన్నారంటే?

కాగా, గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడిపోయింది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించగా.. వైనాట్‌ 175 అంటూ ఎన్నికల్లో వెళ్లిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన విషయం విదితమే. అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీకి సీట్లు దక్కినా.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. ఈవీఎంలపై విపక్షాల నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.