మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత వారం డీఎస్సీ, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై సీబీఐ విచారణకు సవాల్ చేసినప్పటికీ.. ప్రభుత్వం దానిపై స్పందించకుండా, అసలు అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు మైనస్ 52 శాతంగా ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్రలో కూడా మైనస్ 47 శాతం వర్షపాతం లోటు నమోదైందని జగన్ తెలిపారు.
‘గత వారం డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ విచారణకు సవాలు చేశాం. దానిపై సీఎం చంద్రబాబు ఏమీ మాట్లాడరు. కోడు గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం స్పందించటం లేదు. బీసీ రిజర్వేషన్స్ పై చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారు. పోలీసులే పాత్రధారులై గంజాయి విక్రయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా స్పందన లేదు. జూన్, జూలై, ఆగష్టు వరకు వర్షపాతం లోటు మైనస్ 52 శాతంగా ఉంది. కోస్తాంధ్రలో వర్షపాతం లోటు మైనస్ 47 శాతం. ఏ జిల్లాలో చూసినా వర్షపాత లోటు ఉన్నా.. కుంభకర్ణుడిలా చంద్రబాబు నిద్ర నటిస్తున్నారు’ అని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.
‘రాష్ట్రంలో 688 మండలాలకు గానూ 625 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటుంది. 434 మండలాలు లోటు వర్షపాతం కాగా.. 191 మండలాల్లో ఎక్కువ తీవ్రత కనిపిస్తుంది. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు ఇలాంటి పరిస్థితి ఉందని గుర్తించటానికి కూడా ఇష్టపడటం లేదు. రైతులను, ప్రజలను ఆదుకోవడానికి ఏ మాత్రం అడుగులు వేయటం లేదు. రాష్ట్రంలో 63 లక్షల ఎకరాలకు గానూ 80 శాతం మాత్రమే సాగైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత మధ్యలో జూలై 10న పంటలకు నీళ్లు ఇస్తామని మంత్రులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పబ్లిసిటీ స్టంట్ చేశారు. ఈ ఏడాది నీళ్లు ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు సాగుచేశారు. వేసిన నార్లు మొత్తం ఎండిన పరిస్థితి ఉంది’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా సరైన ప్రణాళికలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వర్షాలు లేకుండా సంక్షోభం వస్తే చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. రాయలసీమకు నీళ్లిచ్చే విషయంలో చంద్రబాబు ఆలోచన దుర్మార్గంగా ఉంది. ఆగష్టు 11న శ్రీశైలం ప్రాజెక్టుకు 880 అడుగుల నీళ్లు వచ్చాయి. అవకాశం ఉన్నా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు విడుదల చేయలేదు. నీటిమట్టం తగ్గేకొద్దీ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. శ్రీశైలం నుంచి ఎడాపెడా తెలంగాణ, ఆంధ్రా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ తో కరువు అని కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి నీళ్లు మొత్తం మూడు వారాల్లో 850 అడుగుల దిగువకు చేరుతుంది. రోజుకు 3.5 టీఎంసీల లెక్కన వాడుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో నీరు దాదాపుగా డెడ్ స్టోరేజ్ కు వచ్చాయి’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

