ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇసుక నుంచి మైనింగ్ వరకు వివిధ రంగాల్లో మాఫియా వ్యవస్థ పనిచేస్తోందని.. పెద్దబాబుకు ఇంత, చిన్నబాబుకు ఇంత అంటూ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసు, ఇతర అధికారులను అక్కడే కొనసాగిస్తూ వారిని ఒక సిండికేట్‌లా తయారు చేశారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్‌బుక్ రాజ్యాంగం, వివక్ష, అరాచకం కనిపిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల కారణంగానే చంద్రబాబు ధైర్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియపై కూడా వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు. నామినేషన్ కేంద్రాల్లోకి నలుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుందని, అయితే టీడీపీకి చెందిన కొందరు మారణాయుధాలతో వందలాది మంది వెళ్లిన ఘటనలపై కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లినప్పుడు వారి నుంచి నామినేషన్ పత్రాలను లాక్కుంటున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) నామినేషన్ పత్రాలను స్వీకరించడం లేదని, ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలిసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం అమలులో ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తావిస్తూ.. వైఎస్ జగన్ గత అనుభవాలను వివరించారు. అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ టీడీపీ సానుభూతిపరుడిగా వ్యవహరించారన్నారు. ఆయన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే కలెక్టర్లు, ఎస్పీలు సహా పలువురు అధికారులను భారీగా బదిలీ చేశారని.. అయినప్పటికీ తమ పార్టీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిందని చెప్పారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం సాధించామని, 724 డివిజన్లలో సుమారు 85 శాతం స్థానాలను గెలుచుకున్నామని జగన్ తెలిపారు. ఎన్నికలు జరిగిన 85 మున్సిపాలిటీల్లో 83 చోట్ల విజయం సాధించామని, 81 శాతం వార్డులను కైవసం చేసుకున్నామని పేర్కొన్నారు. మొత్తం స్థానిక సంస్థల్లో 97 శాతం విజయాలు సాధించినట్లు జగన్ వెల్లడించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేసి ప్రజల ముందుకు వెళ్లిందని వైఎస్ జగన్ అన్నారు. అవినీతికి, లంచాలకు అవకాశం లేని పాలన అందించామని పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, 22 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’, ‘సూపర్ సెవెన్’ హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన బాండ్లు కూడా గాలికి ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. ఏమీ చేయకుండానే అన్నీ చేసేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివక్ష, అరాచకం పెరిగిపోయాయని, ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని జగన్ విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో తమ పార్టీ అభ్యర్థులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎన్నికల సంఘం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

