Site icon NTV Telugu

YS Jagan: కుయ్‌ కుయ్‌ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి!

Jagan Ys

Jagan Ys

108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుయ్‌ కుయ్‌ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు ప్రభుత్వం ఉరివేస్తోందని ఫైర్ అయ్యారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో.. ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ.. వీడియోతో సహా ఎక్స్‌లో పోస్టు చేశారు.

Also Read: CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!

‘కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు @ncbn ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైసీపీ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే.. దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడం లేదు?. ఫోన్‌ చేసినా ఎందుకు రావడం లేదు?. ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా?. కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటే కదా?’ అని వైఎస్ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version