NTV Telugu Site icon

YS Jagan: శ్రీవారి లడ్డూ వివాదంపై వైఎస్ జగన్‌ రియాక్షన్

Ys Jagan

Ys Jagan

YS Jagan: శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ స్పందించారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని ఆయన పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ తీవ్రంగా విమర్శించారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా?, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు. ప్రతి 6 నెలలకు ఓ సారి నెయ్యి సరఫరా కోసం టెండర్లను పిలుస్తారని జగన్ వివరించారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదన్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమల లడ్డూ తయారీ జరుగుతోందన్నారు.

Read Also: TTD EO Shyamala Rao: లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో స్పందన

ఒకే విధానంలో లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోందన్నారు. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ NABL సర్టిఫికేట్ తీసుకుని రావాలన్నారు. ప్రతి ట్యాంకు శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్‌ చేస్తారని, మూడు టెస్టులు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుందని జగన్ వివరించారు. చంద్రబాబు జరగనిది జరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారని జగన్ అన్నారు. జులై 12 శాంపిల్స్ తీసుకున్నారు.. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని చెప్పారు. జులై 17న ఎన్డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని.. ఎన్డీడీబీ ఆ రిపోర్టును జులై 23న అందజేసిందన్నారు. జులై 23న రిపోర్టు ఇస్తే ఇప్పటివరకు చంద్రబాబు ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. జులై 23న రిపోర్టు వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. మా హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేశామన్నారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. 2015 నుంచి 2018 వరకు KMF వారి నెయ్యి సరఫరా జరగలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలపై ల్యాబ్స్‌ను మెరుగు పరిచామన్నారు. వైసీపీ హయాంలో తిరుమలలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చామన్నారు. టీటీడీ స్వతంత్ర సంస్థ అని.. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని జగన్ పేర్కొ్న్నారు.

మంత్రి వర్గం కూర్పు కంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు కూర్పు తనకు కష్టమని, విశిష్టమైన వ్యక్తులతో బోర్డు ఏర్పాటు చేయటం జరుగుతుందని వెల్లడించారు. టెండర్ల విషయంలో టీటీడీ బోర్డుది మాత్రమే ఫైనల్ నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇక్కడ నిర్ణయాల్లో జోక్యం చేసుకోదన్నారు. దేవుడి ద్వారా సేవ చేయాలని భావించే వ్యక్తులు మాత్రమే బోర్డులో ఉంటారన్నారు. 45 సార్లు అయ్యప్ప మాల వేసిన వైవీ సుబ్బారెడ్డి వంటి వ్యక్తి కంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారన్నారు. సుబ్బారెడ్డి దైవ భక్తి కలవారని పేర్కొన్నారు. బురద వేయాలని మాత్రమే దుర్బుద్ధితో ఇలాంటివి చేస్తారన్నారు. ఇలాంటివి చంద్రబాబు మాట్లాడడం ఏపీ చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. లడ్డూ ప్రసాదం ఆరోపణలపై ప్రధాని, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాస్తామని జగన్ తెలిపారు. విచారణ చేయాలని కోరతామన్నారు.

Read Also: Pawan Kalyan: కుమార్తెకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి

చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజల ముందు దోషిగా మిగిలారని, ఎన్నికల హామీల అమలు ఊసు లేదని వైఎస్ జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్ ఏమైందో తెలియదన్నారు. చంద్రబాబు ప్రజలకు ఎన్నికలకు ఇచ్చిన మాట అబద్దాల మూట అంటూ పేర్కొన్నారు. 100 రోజుల పాటు చంద్రబాబు మోసంతో పాలన చేశారన్నారు. మంచి పాలన అంటూ స్టిక్కర్లు అంటించాలని అడ్వర్ టైజ్ మెంట్స్ ఇస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్, గోరు ముద్ద, అమ్మ ఒడి అమలు లేదని.. 108, 104 సిబ్బందికి జీతాలు లేవన్నారు.ప్రభుత్వం కట్టే మెడికల్ కాలేజీలను స్కాం చేయటం కోసం ప్రైవేట్ వాటికి ఇచ్చే పనులు జరుగుతున్నాయన్నారు.

చంద్రబాబు హయాంలో రైతులు రోడ్డున పడ్డారన్నారు. పెట్టుబడి సాయం ఇంత వరకు రూపాయి అందలేదన్నారు. వ్యవస్థలు అన్నీ తిరోగమనం వైపు వెళ్తున్నాయని మండిపడ్డారు. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. వ్యవసాయ సలహా మండళ్లు రద్దు అయ్యాయని, ఏ రంగం చూసినా తిరోగమనం అయ్యాయన్నారు. ప్రతి పథకం వైసీపీ హయాంలో డోర్ డెలివరీ పారదర్శకంగా జరిగేవన్నారు. టీడీపీ హయాంలో ఇప్పుడు జన్మభూమి పథకాల ద్వారా ఇళ్లలో పథకాలు అమలు చేస్తారు అంటున్నారన్నారు. దొంగ కేసులు పెట్టి అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని వ్యాఖ్యానించారు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తున్నారని జగన్‌ పేర్కొన్నారు. దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముంబై నుంచి సినీ నటిని డైవర్షన్ కోసం రంగంలోకి దింపారన్నారు. వర్షం వరదలపై చంద్రబాబు రివ్యూ చేయకపోవటం వల్ల విజయవాడను వరద ముంచెత్తి 60 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వ వైఫల్యం డైవర్షన్ చేయటానికి ప్రకాశం బ్యారేజ్‌ని బోట్లతో ధ్వంసం చేసే ప్రయత్నం చేశామని ఆరోపణలు చేశారన్నారు.