Site icon NTV Telugu

YS Jagan: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత!

Ycp Activist Singaiah

Ycp Activist Singaiah

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్‌ వద్ద కారు ఢీకొని మృతి చెందిన వెంగళాయపాలెంకు చెందిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమాలు పరామర్శించారు. అనంతరం వైసీపీ పార్టీ తరఫున 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సింగయ్యను ఢీకొట్టిన వాహనం వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ప్రధాన అనుచరుడు గొట్టిపాటి హరీష్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ‘సింగయ్య వైసీపీ కార్యకర్త, వైఎస్ జగన్ అభిమాని. జగన్ పర్యటనలో కారు యాక్సిడెంట్‌తో సింగయ్య మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలిసిన వెంటనే జగన్ ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతిని కూడా ప్రభుత్వం రాజకీయం చెయ్యాలని చూసింది. జగన్ పర్యటనపై వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు, వాటిపై న్యాయపోరాటం చేస్తాం. వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. జగన్ పర్యటనకు ప్రజలను రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం, పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు’ అని అన్నారు.

Also Read: MLC Naga Babu: జనం గట్టిగా బుద్ధి చెప్పారు.. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు!

‘సింగయ్య వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్త. యాక్సిడెంట్‌లో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది’ అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version