Site icon NTV Telugu

YS Jagan: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌..

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

YS Jagan: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్.. ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. తాజా పరిణామాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. జర్నలిస్టుల అరెస్టులు పత్రికా స్వేచ్ఛకే కాకుండా ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి అని ఖండించారు. పండుగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి పోలీసులు తలుపులు పగులగొట్టి ప్రవేశించి, చట్టపరమైన విధి విధానాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం అత్యంత దారుణం అని పేర్కొన్నారు.

Read Also: NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన ఏపీయూడబ్ల్యూజే..

జర్నలిస్టులు నేరస్తులు కూడా కాదని.. ఉగ్రవాదులు కూడా కాదని స్పష్టం చేసిన వైఎస్‌ జగన్‌.. అయినప్పటికీ వారిపై అనవసరంగా కఠినంగా వ్యవహరించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని అన్నారు. ఈ తరహా చర్యలు జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్రమైన మానసిక వేదనను కలిగించడమే కాకుండా, మొత్తం మీడియా వర్గంలో భయాందోళనలను సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. టెలికాస్ట్ అయిన వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించాలని, సంబంధిత సంస్థలను సంప్రదించాలని అన్నారు. కానీ పోలీసు, అధికార బలాన్ని ఉపయోగించి జర్నలిస్టులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్టు చేసిన ఎన్టీవీ జర్నలిస్టులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి, చట్టపాలనను కాపాడాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్.

Exit mobile version