అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాను అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి నవంబర్ 22వరకూ రచ్చబండ కార్యక్రమం ఉంటుందని, మెడికల్ కాలేజీల ప్రైవటీకరణపై కరపత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కోటి సంతకాలను రచ్చబండ కార్యక్రమాల ద్వారా సేకరిస్తామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయ కర్త ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శిస్తాడని, అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు ఉంటాయని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు.
‘అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి డిమాండ్ పత్రాలను సమర్పించాలి. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ర్యాలీలు జరుగుతాయి. ఒక జిల్లాలో నేను కూడా పాల్గొంటాను. నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. నవంబర్ 24న సేకరించిన సంతకాలతో కూడిన వాహనాలను జిల్లా కేంద్రంలో జెండా ఊపి విజయవాడకు తరలిస్తారు. సేకరించిన ఈ సంతకాలు గవర్నర్ గారికి అప్పగించే కార్యక్రమం తదుపరి జరుగుతుంది’ అని వైఎస్ జగన్ తెలిపారు. ‘ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూశాం. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కడం ఇప్పుడు చూస్తున్నాం. మన హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ అలాంటివి లేవు. ఎరువుల పంపిణీలో కూడా స్కాం చేశారు. దళారీలతో చేతులు కలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పేదలను ఇంకా అన్యాయం చేస్తున్నారు. వారిని మరింత పేదరికంలోని నెడుతున్నారు’ అని మాజీ సీఎం మండిపడ్డారు.
Also Read: YS Jagan: ముఖ్యమంత్రికి పాలన మీద కాదు.. సొంత ఆదాయాలు పెంచుకోవడం మీదే ధ్యాస!
‘భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. మనం కొత్తగా పెట్టిన కాలేజీలను ఇప్పుడు తన బినామీలకు, మనుషులకు తెగనమ్ముతున్నాడు. మనం వచ్చేంత వరకూ రాష్ట్రంలో ఉన్నవి 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే. మనం ఒక విజన్‌ను ఆవిష్కరించాం. ప్రతి జిల్లాల్లో గవర్నమెంటు కాలేజీ ఉండాలన్న సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు ఎందుకు నడుపుతుంది?. అలా చేయకపోతే ప్రైవేటు వాళ్లు ప్రజలను దోచుకుంటారు. ఇవి నడపకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఉన్నప్పుడే 2023-24లోనే కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మరో రెండు కాలేజీలు క్లాసులకు అందుబాటులోకి తెచ్చాం. తద్వారా 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పులివెందులోల 50 సీట్లు NMC ఇస్తే.. వద్దని చంద్రబాబు లెటర్ రాశాడు. మన హయాంలోనే అవసరమైన నిధులకు ఫైనాన్సియల్ టై అప్ చేశాం. అమరావతికి 50వేల ఎకరాలు సరిపోవని, మరో 50వేల ఎకరాలు సేకరిస్తున్నాడు. మొదటి 50 వేల ఎకరాలకే మౌలిక సదుపాయాలకోసం రూ.1లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు కేవలం మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నారు. అలాంటి లక్షల మందికి, కోట్ల మందికి వైద్యం అందించి, చిరస్థాయిగా నిలబడే ఆస్తులైన మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేస్తున్నారు?. ఐదేళ్లలో రూ.5వేల కోట్లు పెట్టలేరా?. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది’ అని నేతలను ఉద్దేశించి జగన్ అన్నారు.
