YS Jagan: పార్టీ మారిన కార్పొరేటర్లను వారి విజ్ఞతకే వదిలేద్దామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‌లో కడప మున్సిపల్ కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏమి సాధించిందని కార్పొరేటర్లు టీడీపీకి వెళ్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సమస్యలు ఉంటే కడప ఎంపీ వైయస్ అవినాష్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
Read Also: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. త్వరలో మరో 200 మంది!
గతంలో తనను కూడా 16 నెలలు జైల్లో పెట్టారని, ఆనాడు తన భార్య బెయిల్ కోసం చాలా ఇబ్బంది పడింది అంటూ తన కుటుంబం పడ్డ బాధను కార్పొరేటర్లకు వైఎస్ జగన్ వివరించారు. ఈ భూ ప్రపంచంపై తాను పడ్డ బాధలు ఇంకా ఎవరూ పడి ఉండరని ఆయన పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం కొందరు పార్టీ మారి ఉండవచ్చని.. మీరు పార్టీ మారాల్సిన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాను తిరిగి సీఎం అయితే మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు సీఎం అయినట్లేనని వారికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో మనందరికీ మంచి రోజులు వస్తున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్లతో వేరువేరుగా మాట్లాడారు.