Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..

Raman Nandu

Raman Nandu

ప్రముఖ యూట్యూబర్లు నందు, మధు దంపతుల వీసా మోసాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక కీలకమైన అలెర్ట్ పోస్ట్ చేశారు. ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా లగ్జరీ లైఫ్‌స్టైల్ చూపిస్తూ, అమాయక నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకోవడానికి కొందరు యూట్యూబర్స్ ప్రయత్నిస్తున్నారని పోలీసులు స్పందించారు. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో జరిగే మోసపూరిత వలలో చిక్కుకోవద్దని నిరుద్యోగులను హెచ్చరించారు.

రూ.15 లక్షల మోసం..
లండన్ నుంచి వచ్చిన శివ క్రాంతి కుమార్ అనే యువకుడు తన వీసా రెన్యువల్, భార్య ఉద్యోగం కోసం ఈ దంపతుల ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ని నమ్మి రూ.15 లక్షలు ఇచ్చి మోసపోయారు. నిందితులు ‘అగార్డ్ సొల్యూషన్స్’ పేరుతో ఒక నకిలీ స్పాన్సర్‌షిప్ లెటర్ (COS) సృష్టించినట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్ (A1), రమానందన (A2), మోహన్‌రావు (A3)లపై కేసు నమోదు చేశారు. నిందితులు విచారణకు సహకరించకపోవడంతో శుక్రవారం వీరికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.

×
×
Ad

తాజాగా.. తెలంగాణ పోలీసులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇలాంటి వీసా మోసాలకు పాల్పడేవారికి భారత ఇమ్మిగ్రేషన్ చట్టాలు, BNS చట్టాల ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని పోస్ట్ చేశారు. ఒకవేళ మీరు వీసా స్కామ్‌లో బాధితులైతే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా సీసీఎస్ (CCS) లో రిపోర్ట్ చేయాలన్నారు.

కన్సల్టెన్సీ పేరు, యజమాని వివరాలతో పాటు మీ దగ్గర తీసుకున్న డబ్బుల రుజువులతో భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కి, సీబీఐ (CBI) కి ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా ఆ కన్సల్టెన్సీ లేదా యజమానులకు సంబంధించిన ఆస్తులను సీజ్ చేసే అవకాశం ఉంటుంది. నోరు తెరిస్తే విదేశీ ముచ్చట్లు చెప్పే ఇలాంటి కన్సల్టెన్సీలు, యూట్యూబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.