SI Suspend: గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఎస్సై రవితేజ అందుబాటులోకి రాకపోవడం, విధులకు గైర్హాజరవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈక్రమంలో ఆయనను ఎస్పీ సస్పెండ్ చేశారు.
అసలేం జరిగిందంటే.. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ గుంటూరు నగరంపాలెంకు చెందిన ఎస్సై కుంచాల రవితేజపై ఓ యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యువతి నర్సుగా పనిచేస్తోంది. ఎస్సై రవితేజ ఏడాదిన్నరగా ప్రేమిస్తున్నానని చెప్పి.. అతడు నివాసముంటున్న అపార్ట్‌మెంటుకు పలుమార్లు తీసుకెళ్లాడని ఆమె తెలిపింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోరితే మొహం చాటేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Suicide Attempt: మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యాయత్నం.. ఆస్తి పంచడం లేదని..
ఇదే విషయంపై పదిరోజుల క్రితం ఎస్పీ కార్యాలయంలోని స్పందనలో ఫిర్యాదు చేశానని తెలిపింది. అప్పటి నుంచి ఎస్సై, అతడి కుటుంబసభ్యులు తనను బెదిరిస్తున్నారని.. ఈ విషయాలు బయట చెబితే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. తనను మోసగించిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదు చేయగా.. సీఐ హైమారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎస్సై రవితేజను వివరణ కోరగా తనపై యువతి అసత్య ఆరోపణలు చేస్తోందని.. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎస్సై విధులకు గైర్హాజరు అవుతుండగా.. అధికారులు తీవ్రంగా పరిగణించి సస్పెండ్ చేశారు.