Suicide Attempt: చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదం చెలరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని ఆస్తిలో అన్న తనకు రావాల్సిన వాటా అన్న ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం పుంగనూరులో చోటుచేసుకుంది. గతంలో పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న నంజప్పకు కుమారులు మునిరత్నం, శంకరప్ప, కుమార్తె పార్వతమ్మ ఉన్నారు. నంజప్ప మృతి తర్వాత ఆస్తి కోసం కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ముత్తుకూరు వద్ద తండ్రి సంపాదించిన 60 ఎకరాలు, పుంగనూరు పట్టణంలోని ఇళ్లు, స్థలాల్లో భాగం కావాలని తాము కోరుతున్నా వెంకటరత్నం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని శంకరప్ప ఆవేదన చెందారు. తాను మరణిస్తే తన బిడ్డలకైనా ఆస్తి ఇవ్వాలంటూ ఆయన ఇంట్లో తలుపులు వేసుకుని సోమవారం ఉదయం పెట్రోల్ పోసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి బాటిల్ లాక్కొని ఒంటిపై నీళ్లు పోశారు. ఈ ఘటన తర్వాత శంకరప్ప కుమారుడు నంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంజప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తదనంతరం ఉన్న ఆస్తుల విషయంలోనే కుమారుల మధ్య వివాదం నడుస్తోంది.
Read Also: AP CM Jagan: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని చేపట్టిన సీఎం జగన్
పెద్దపంజాణి మండలం ముత్తుకూరు, పుంగనూరు పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే కుమారులకు భూములు ఉన్నాయి. అందులో పెద్ద కుమారుడు వెంకటరత్నం.. చిన్న కుమారుడు శంకరప్పకు రావాల్సిన భాగం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆస్తి విషయమై పెద్దమనుషుల్ని కూర్చోబెట్టి పంచాయతీల్లో తీర్మానం కూడా చేశారు. అయినా తమకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు శంకరప్ప చెబుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని.. ఆ ఆస్తుల వ్యవహారంపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. అక్కడికి వచ్చిన పోలీసులు.. వెంకటరత్నంను పిలిపించి న్యాయం చేస్తామని తెలిపారు. తాము చాలా పేదరికంలో జీవిస్తున్నామని, అప్పులు అధికంగా ఉండటంతో చెల్లించలేక చింతపండు పనులకు వెళుతున్నట్లు శంకరప్ప కుటుంబీకులు వాపోయారు. తమకు ఇప్పటికైనా అధికారులు న్యాయం చేసి తనకు రావాల్సిన వాటా ఇప్పించాలని వారు కోరారు.