ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది. పదేళ్లుగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 11వ ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకమైంది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా యోగాడే జరిగింది. ఈ విశేష కార్యక్రమాన్ని ఏ.పి.ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్వహించింది.
ఈ అపూర్వ కార్యక్రమంలో మూడు లక్షలకు పైగా యోగ సాధకులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది యోగా సాధకులు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్‌లోని సూరత్‌లో నమోదైన రికార్డును ‘యోగాంధ్ర-2025’ అధిగమించడం విశేషం.
