YSRCP: రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లు అనూహ్యంగా చేదు అనుభవం ఎదుర్కొంది వైసీపీ.. అయితే, ఈసారి ముందుగా అలర్ట్ అయ్యింది అధికార పార్టీ.. తమ పార్టీ రెబల్స్ పై అనర్హతకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.. మరోవైపు.. ఇద్దరు ఎమ్మెల్సీలు సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ పై కూడా ఫిర్యాదులు వెళ్లాయి.. అయితే, ఒకే సారి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా వేటు పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారింది.. మరోవైపు.. నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులతో టికెట్ గల్లంతు అయిన సిట్టింగుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పటి వరకు 29 మంది సిట్టింగ్ లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొండిచేయి ఇచ్చింది.. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. సీటు దక్కని మరికొందరు సిట్టింగ్‌ల్లో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలతో టచ్‌లోకి వెళ్లారు.. దీంతో, రాజ్యసభ ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా వైసీపీ పావులు కదుపుతోంది. మరోవైపు.. ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ అందజేశారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. ఆ రాజీనామాపై స్పీకర్ తమ్మినేని త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.