దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో విడుదల అయి మంచి విజయం సాధించింది.మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘యాత్ర2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం మరియు ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్ ఎదిగిన విధానాన్ని చూపించనున్నారు.అలాగే అప్పట్లో జగన్ చేసిన పాదయాత్రను కూడా ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది. వైయస్ జగన్ పాదయాత్రతో మొదలై ముఖ్యమంత్రి అయ్యే వరకు ‘యాత్ర2’ కథ కొనసాగనుందట. ఇందులో వైయస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నాడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు అయిన మహేష్ మంజ్రేకర్ మరియు కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు.
ఇక ఈ సీక్వెల్ని కూడా 2024 ఫిబ్రవరి 8 న విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీకి కొద్ది రోజుల టైం మాత్రమే ఉండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్స్ మరియు టీజర్ తో పాటు ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘చూడు నాన్న’ అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫాదర్ సెంటిమెంట్ తో ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ పాట కూడా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘తొలి సమరం’ అంటూ సాగే వీడియో సాంగ్ లో వైఎస్ జగన్ (జీవా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పార్టీ తరపున ఎన్నికల శంఖారావం పూరించడం, ప్రచారంలో పార్టీ గుర్తు ‘ఫ్యాన్’ ని ప్రదర్శించడం వంటి దృశ్యాలు ఉన్నాయి.ఈ పాటలో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విజువల్స్ కూడా అధ్బుతంగా ఉన్నాయి. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్ భరధ్వాజ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ బాగా నెట్టింట వైరల్ అవుతోంది.