Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..

Yashaswi Jaiswal

Yashaswi Jaiswal

భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు ఒక అరుదైన, వినూత్నమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023లో వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్, ఇప్పటివరకు తన కెరీర్‌లో 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఆడిన ఈ 29 టెస్టులు కూడా ప్రతిసారీ వేర్వేరు వేదికలలోనే (స్టేడియంలలో) జరగడం విశేషం. ఏ ఒక్క మైదానం కూడా మళ్లీ రిపీట్ కాకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటనగా నిలిచింది. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టును గాల్‌ వేదికగా ఆడబోతున్నాడు. గాల్‌లో జైస్వాల్‌కి ఇది తొలి మ్యాచ్ కావడంతో, ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది.

ఇప్పటివరకు ఆడిన 29 టెస్టుల్లోని 54 ఇన్నింగ్స్‌లలో జైస్వాల్ 48.75 సగటుతో మొత్తం 2,535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు కాగా, కెరీర్‌లో రెండు ద్విశతకాలు కూడా సాధించాడు. 66.11 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడే ఈ డాషింగ్ ఓపెనర్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇప్పటివరకు 317 ఫోర్లు, 45 సిక్సర్లు బాదాడు. పార్ట్‌టైమ్ బౌలర్‌గా 3 ఇన్నింగ్స్‌లలో తలో ఓవర్ చొప్పున వేసి 18 పరుగులిచ్చాడు.

2023లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్, జూన్ 2026లో అఫ్గానిస్థాన్‌పై చివరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందినప్పటికీ, టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్‌గా మారాడు. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాల్ వేదికగా భారత్-శ్రీలంక తొలి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ జరగనున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో వరుసగా 30 మ్యాచ్‌లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ఈ సిరీస్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.