NTV Telugu Site icon

IND vs WI: చెలరేగిన యశస్వి, గిల్.. నాలుగో టీ20లో భారత్ ఘన విజయం! సిరీస్‌ సమం

Yashasvi Jaiswal And Shubman Gill

Yashasvi Jaiswal And Shubman Gill

Yashasvi Jaiswal and Shubman Gill Fifties Help India Level Series vs West Indies: వెస్టిండీస్‌పై తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్‌ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లో నెగ్గిన యువ భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను టీమిండియా ఓడించింది. వెస్టిండీస్‌ నిర్ధేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ 17 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (84 నాటౌట్‌; 51 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్‌ గిల్‌ (77; 47 బంతుల్లో 3×4, 5×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక సిరీస్ డిసైడర్ అయిన చివరి టీ20 ఆదివారం జరగనుంది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. షిమ్రాన్‌ హెట్‌మయర్‌ (61; 39 బంతుల్లో 3×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. షై హోప్‌ (45; 29 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మేయర్స్‌ (17), కింగ్‌ (18), పూరన్‌ (1), పావెల్‌ (1) విఫలమయ్యారు. హెట్‌మయర్‌ ధాటిగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/38), కుల్దీప్ యాదవ్‌ (2/26) ఆకట్టుకున్నారు.

Also Read: Gold Today Rate: మగువలకు బ్యాడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఛేదనలో భారత్‌కు ఏ ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ధాటిగా ఆడుతూ పరుగులు చేశారు. ముఖ్యంగా తొలి బంతికి ఫోర్‌ బాదిన యశస్వి.. వరుస బౌండరీలతో అలరించాడు. యశస్వి ధాటికి భారత్ తొలి 6 ఓవర్లలోనే 66 పరుగులు చేసింది. గిల్ కూడా బాదుడు మొదలెట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 100కు చేరింది. ఈ క్రమంలో 30 బంతుల్లో గిల్.. 33 బంతుల్లో యశస్వి హాఫ్‌ సెంచరీలు పూర్తిచేశారు. భారత్ విజయానికి దగ్గరలో గిల్ ఔటైనా.. తిలక్ వర్మతో కలిసి యశస్వి పని ముగించాడు.