NTV Telugu Site icon

CWC 2023 Final: భారత్ బ్యాటింగ్‌, బౌలింగ్ బాగున్నా.. ఎక్స్‌ట్రాలు మాత్రం భయపెడుతున్నాయి! ఓటమి కొని తెచ్చుకోవడమే

Indian Team New

Indian Team New

Extras scare Team India before India vs Australia CWC 2023 Final: ప్రపంచకప్‌ 2023లో భారత్ అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ.. ఫైనల్ చేరింది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. రోహిత్ సేన మిషన్ విజయవంతంగా పూర్తవుతుంది. మెగా టోర్నీలో జోరు చూస్తే.. భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఐదుసార్లు విశ్వవిజేత అయిన ఆస్ట్రేలియాపై ఏ చిన్న పొరపాటు చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటివరకు టోర్నీని ఓసారి పరిశీలిస్తే.. టీమిండియాను ఎక్స్‌ట్రాలు మాత్రం భయపెడుతున్నాయి.

ఫీల్డింగ్‌ తప్పిదాలు:
ప్రపంచకప్‌ 2023లో భారత్ బ్యాటింగ్‌, బౌలింగ్ బాగున్నా.. ఫీల్డింగ్‌, ఎక్స్‌ట్రాలు మాత్రం భయపెడుతున్నాయి. నిజానికి టోర్నీ ఆరంభంలో భారత్ ఫీల్డింగ్‌ మెరుగ్గానే ఉంది. లీగ్‌ చివరి మ్యాచ్ (నెదర్లాండ్స్), సెమీస్‌ (న్యూజిలాండ్‌)లో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం భారత ఫీల్డింగ్ నిరాశ పర్చింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, మహమ్మద్ షమీ రెండు కీలక క్యాచ్‌లు వదిలేశారు. ఫైనల్‌లో ఇలా ఆస్ట్రేలియా బ్యాటర్లుకు లైఫ్‌ ఇస్తే.. ఓటమిని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇందుకు ఉదాహరణే అఫ్గానిస్తాన్ జట్టు. గ్లెన్ మాక్స్‌వెల్ క్యాచ్ జారవిడిచిన అఫ్గాన్.. సెమీస్ ఆశలు వదులుకుంది. అందుకే ఫైనల్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు.

భారీగా ఎక్స్‌ట్రాలు:
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో భారత బౌలర్లు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లపై ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. దాంతో 29 అదనపు పరుగులు ఇచ్చారు. ప్రధాన పేసర్లు బుమ్రా, షమీ పదే పదే వైడ్స్ వేశారు. అందులో కొన్ని బౌండరీలు కూడా వెళ్లాయి. దాంతో కెప్టెన్ రోహిత్ కాస్త అసహనానికి గురయ్యాడు. 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఫైనల్స్‌లో అడుగుపెట్టిన భారత్‌.. ఎక్స్‌ట్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

Also Read: IND vs AUS World Cup Final: భారత్ టైటిల్ గెలవాలంటే.. రెచ్చిపోవాల్సింది విరాట్ కోహ్లీ కాదు!

బ్యాటింగ్‌, బౌలింగ్ అదుర్స్:
ప్రపంచకప్‌ 2023లో భారత్ టాప్ ఆర్డర్‌ సూపర్ ఫామ్‌లో ఉంది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్ పరుగుల వరద పారిస్తున్నారు. గిల్ మినహా మిగతా వారందరూ సెంచరీలతో చెలరేగారు. ఈ టోర్నీలో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా భారత్ ఆలౌట్‌ కాలేదు. 1-2 మ్యాచ్‌లలో మినహా అన్నింట్లోనూ భారత్‌ టాప్ ఆర్డర్‌ సక్సెస్ అయింది. భీకర ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్లు.. స్టార్క్‌, కమిన్స్‌, జంపా త్రయాన్ని సులువుగా ఎదుర్కోనున్నారు. మరోవైపు భారత బౌలింగ్‌ దళం భీకరమైన ఫామ్‌లో ఉంది. షమీ, బుమ్రా, జడేజా, కుల్దీప్‌ వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా షమీ అత్యుత్తమ బౌలింగ్‌ చేస్తున్నాడు. వీరిని ఎదుర్కోవడం ఆసీస్ బ్యాటర్లకు పెను సవాల్ అని చెప్పాలి.

Show comments