NTV Telugu Site icon

World Cup 2023 Semi Final Scenario: ఆ రెండు టీమ్స్ గెలిస్తే.. నాలుగు జట్లు ఔట్‌! నేడు డబుల్ ధమాకా

Icc Odi World Cup 2023 New

Icc Odi World Cup 2023 New

ODI World Cup 2023 Semi Final Scenario: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా క్రికెట్ అభిమానులకు నేడు డబుల్ ధమాకా ఉంది. నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం ఉదయం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ తలపడనుండగా.. మధ్యాహ్నం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సెమీస్‌ రసవత్తరంగా మారిన నేపథ్యంలో నేటి రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులకు మంచి వినోదాన్ని పంచె అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచకప్‌ 2023లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో నాలుగు గెలిచిన ఆస్ట్రేలియా.. సెమీస్ బెర్త్ లక్ష్యంగా నేడు బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి విమర్శల పాలైన ఆసీస్.. బలంగా పుంజుకుని వరుసగా నాలుగు విజయాలు అందుకుంది. వరుస విజయాలతో సెమీస్‌ అవకాశాలను బాగా మెరుగుపరుచుకుంది. ఇంగ్లండ్‌పై గెలిస్తే ఆసీస్ మరో అడుగు ముందుకేస్తుంది. అందుకే గెలుపే లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది. అయితే గాయంతో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, వ్యక్తిగత కారణాలతో మిచెల్‌ మార్ష్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి.. దాదాపుగా సెమీస్‌ నుంచి తప్పుకున్న ఇంగ్లీష్ జట్టు పరువు కోసం పోరాడనుంది. ఎలాగూ సెమీస్‌ చేరే అవకాశం లేదు కాబట్టి.. ఇంగ్లండ్‌ తెగించి ఆడేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆసీస్‌కు విజయం అంత తేలిక కాకపోవచ్చు.

మరోవైపు నాలుగు వరుస విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించిన న్యూజిలాండ్‌.. ఆపై హ్యాట్రిక్‌ ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగా.. పేసర్‌ మాట్ హెన్రీ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడం షాకే. కివీస్ సెమీస్ చేరాలంటే నేటి మ్యాచ్‌లో విజయం సాదించాల్సిందే. 7 మ్యాచ్‌లలో మూడు విజయాలు అందుకున్న పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయినా లేపాక్ ఆశతోనే ఉంది. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

Also Read: ENG vs AUS: 15 మంది ప్లేయర్స్ మాత్రమేనా.. ప్రపంచకప్‌కు మంచిది కాదు: ప్యాట్ కమిన్స్‌

ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత్ 14 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ తప్ప ఇప్పటివరకు మరే జట్టు కప్పదా అధికారిక బెర్త్ దక్కించుకోలేదు. ఆరు విజయాలు సాదించిన దక్షిణాఫ్రికా దాదాపుగా సెమీస్ చేరినట్టే.ఇక రెండు స్థానాల కోసం రసవత్తర పోటీ జరుగుతోంది. అయితే నేడు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు గెలిస్తే.. పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. అఫ్గానిస్తాన్ జట్టుకు ఇంకా అవకాశాలు ఉండగా.. బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.